రాష్ట్రంలో కాంగ్రెస్ ను ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తూ, ఆ పార్టీకి వీలయినంత దూరంలో ఉంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇప్పుడు ఆ పార్టీతో చెలిమికి సిద్దపడుతున్నారా? కనీసం జాతీయ స్థాయిలో, పార్లమెంట్ వరకైనా కాంగ్రెస్ తో కలసి బిజెపి ప్రభుత్వంపై పోరుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.
కరోనా మొదట్లో ప్రధాని మోదీని విమర్శించిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించిన ముఖ్యమంత్రి నాలుగు రోజుల క్రితం మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వంపై పెద్ద పెట్టున విమర్శలు కురిపించడం, కాంగ్రెస్ పార్టీ పై దాదాపు మౌనంగా ఉండడం ఈ సందర్భంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నది.
ఓ తల్లి విషాదగాధ.. కూతురు చనిపోయిన 2రోజులకే డ్యూటీ!
కరోనాను కట్టడి చేయడంలో కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నదని, తమను సంప్రదించడం లేదని, తమ సూచనలను పరిగణలోకి తీసుకోవడం లేదని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సహితం ఇదే సమయంలో కేంద్రంపై ముప్పేట దాడికి దిగారు.
కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సవరణ బిల్లు ముఖ్యంగా కేసీఆర్ కు ఆగ్రహం కలిగిస్తున్నది. ఇది చట్ట రూపం దాల్చితే ఉచిత విద్యుత్ పేరుతో విద్యుత్ అక్రమ వినియోగానికి కట్టడి ఏర్పడుతుందని, విద్యుత్ ఉత్పాదన సంస్థల వ్యవహారంపై కేంద్రం పర్యవేక్షణ పెరుగుతుందని కేసీఆర్ ఖంగారు పడుతున్నారు.
అందుకనే కేంద్రం ప్రతిపాదిస్తున్న బిల్ రాష్ట్రాల హక్కులకు భంగం కలిగిస్తుందనే పేరుతో, బిజెపియేతర ప్రభుత్వాలను కలుపుకొని కేంద్రంపై ఉమ్మడి పోరుకు సమాయత్తం అవుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
ప్రజారవాణాలో మార్పులు చేర్పులు!
సగం రాష్ట్రాలు ఆమోదం తెలిపితే ఈ బిల్లుకు తెలంగాణ ఒక్క రాష్ట్రం మాత్రమే అభ్యంతరం తెలిపినా ప్రయోజనం ఉండబోదని న్యాయశాఖ కేసీఆర్ కు స్ఫష్టం చేసింది. అందుకనే పార్లమెంట్ లో కాంగ్రెస్, ఇతర పార్టీలను కలుపుకొని రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం పొందకుండా చేయడంకోసం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నట్లు తెలుస్తున్నది.
విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం కోసమే కేంద్రం ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు టి ఆర్ ఎస్ నాయకత్వం ఆరోపిస్తున్నది. పైగా విద్యుత్ ఉమ్మడి జాబితాలో ఉండడంతో సగం రాష్ట్రాలు ఆమోదం తెలిపితే తిరుగు ఉండదు. ఎట్లాగూ సగం రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉంది.
గతంలో బిజెపి, కాంగ్రెస్ లతో సంబంధం లేని మమతా బెనర్జీ సూచించిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ఉత్సాహం చూపిన కేసీఆర్ కు ఇప్పుడు కాంగ్రెస్ లేకుండా పార్లమెంట్ లో బిజెపిని కట్టడి చేయడం సాధ్యం కాదని తెలుసు. అందుకనే కాంగ్రెస్ తో ప్రత్యక్షంగానే, పరోక్షంగానో చేతులు కలపక తప్పని పరిస్థితులు కేసీఆర్ కు ఏర్పడుతున్నాయని ఆ పార్టీ వర్గాలే భావిస్తున్నాయి.