Homeజాతీయ వార్తలుదళితుల బాధ్యత మోత్కుపల్లిపై పెడుతున్న కేసీఆర్?

దళితుల బాధ్యత మోత్కుపల్లిపై పెడుతున్న కేసీఆర్?

హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం తెచ్చిన ద‌ళిత బంధు ప‌థ‌కం రాష్ట్రంలో ఎంత సంచ‌ల‌నంగా మారిందో తెలిసిందే. ఈ ప‌థ‌కాన్ని ఆస‌రాగా చేసుకొని హుజూరాబాద్ గండం గ‌ట్టెక్కాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నారు. దీన్నే బూమ‌రాంగ్ గా మార్చి, కేసీఆర్ ను దెబ్బ తీయాల‌ని విప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

ద‌ళిత బంధు ప‌థ‌కం కేవ‌లం హుజూరాబాద్ ఎన్నిక కోసం తెచ్చిన ఉత్తుత్తి ప‌థ‌క‌మ‌ని విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గానికి కేవ‌లం వంద మందికి ఇచ్చేసి, చేతులు దులుపుకుంటార‌ని, ఉప ఎన్నిక పూర్త‌యిన త‌ర్వాత దీన్ని మూల‌న ప‌డేస్తార‌ని ఆరోపిస్తున్నాయి. దీంతో.. ఈ ప‌థ‌కానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా.. తాము ప‌థ‌కాన్ని చిత్త‌శుద్ధితో తెచ్చామ‌ని చాటుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ద‌ళిత బంధును కార్పొరేష‌న్ గా మార్చి, దానికి మోత్కుప‌ల్లి న‌ర్సింహులును చైర్మ‌న్ గా నియ‌మించ‌బోతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. మోత్కుప‌ల్లి టీఆర్ ఎస్ లో ఇంకా చేర‌లేదు. బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ఆయ‌న‌.. త్వ‌ర‌లోనే గులాబీ గూటికి చేర‌బోతున్నారు. అయితే.. స‌మ‌యం, సంద‌ర్భం చూసి చేర్చుకోవాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. ద‌ళిత బంధుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించిన త‌ర్వాత దానికి చైర్మ‌న్ గా మోత్కుప‌ల్లిని నియ‌మించి, గులాబీ కండువా క‌ప్పాల‌ని చూస్తున్నార‌ట‌.

ఆ విధంగా ద‌ళిత బంధుతో ఓట్లు రాబ‌ట్టే కార్య‌క్ర‌మాన్ని మ‌రింత ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని చూస్తున్నారట గులాబీ బాస్‌. అయితే.. ఇది కేవ‌లం హుజూరాబాద్ ఉప ఎన్నిక కోస‌మే కాద‌ని, వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కూ ఆయుధంగా వాడాల‌ని చూస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే రెండుసార్లు గెలిచిన టీఆర్ ఎస్ పై స‌హ‌జ‌ వ్య‌తిరేకత ఉంటుంది. దానికితోడు విప‌క్షాలు బ‌ల‌ప‌డేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ద‌ళిత బంధును గ‌ట్టిగా వాడుకోవ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌ళిత ఓటు బ్యాంకును ఒడిసిపట్టుకోవాల‌ని చూస్తున్నార‌ట‌.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version