ఆయ్.. మేం గోదారోళ్లమండి అని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వారి యాస, భాషను సినిమాల్లో చూస్తుంటాం.. వారి ప్రేమలు భారీగానే ఉంటాయని కథలు కథలుగా వింటుంటాం.. కానీ ఇప్పుడు నిజంగానే వారి ప్రేమలు, అప్యాయతల విలువ ఏంటో తెలిసింది..
ఏపీలోని గోదావరి జిల్లాల ప్రేమలు, మర్యాదలు, పట్టింపులు ఏ స్థాయిలో ఉంటాయో మరోసారి రుజువైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు ఓ రేంజ్ లో ఉంటాయంటారు.. ఇద్దరు వియ్యంకులు మాత్రం పోటీపడి మరీ కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలో తెలుగు అల్లుడికి ఇచ్చే మర్యాద అంతా ఇంతాకాదు.. ఇక పెళ్లైన కొత్త కోడలికి అంతే పెద్దపీట వేస్తారు. పెళ్లి సమయంలో అల్లుడికి భారీగా కట్నకానుకలు ఇస్తుంటారు. పెళ్లి తర్వాత కోడలికి పంపే సారెకు విలువ ఇస్తారు. గోదావరి జిల్లాల్లో ఇలాంటి మర్యాదలు, పట్టింపులు కాస్త ఎక్కువ.
ఈ క్రమంలోనే ఇద్దరు గోదావరి జిల్లాల వియ్యంకులు పోటీపడి మరీ కానుకలు ఇచ్చికోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం.. గాదరాడ గ్రామానికి చెందిన బత్తుల బలరామకృష్ణ అనే వ్యాపారి తన పెద్ద కుమార్తె ప్రత్యూషను యనాంకు చెందిన తోట రాజు కుమారుడు పవన్ కుమార్ కు ఇచ్చి ఈ ఏడాది మేలో పెళ్లి చేశారు.
గత ఆషాఢ మాసంలో కూతురిని పుట్టింటింకి తీసుకొచ్చేందుకు వెళ్లిన రామకృష్ణ.. తన అల్లుడుకు టన్ను చొప్పున పండుగప్ప రొయ్యలు, చేపలు, రొయ్యలు, బొమ్మిడాయి, అరటన్ను కొర్రమీను చేపలు, 10 పొట్టేళ్లు, 50 పందెం పుంజులు, వందల రకాల స్వీట్లు, టన్ను కూరగాయలు, నిత్యావసర సరుకులతో సారె పంపించారు. లారీల్లో వెళ్లిన ఆషాఢం సారె రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వియ్యంకుడు పంపిన సారెకు ఉబ్బితబ్బిబ్బైన తోట రామకృష్ణ తన వంతు కోసం ఎదురుచూశాడు. ఆషాఢం ముగిసి శ్రావణమాసం వచ్చింది. దీంతో ఏకంగా వియ్యంకుడు తోట రాజు కానుకలతో ముంచెత్తాడు. తాజాగా 10వేల కిలోల 20 రకాల స్వీట్లు పంపాడు. కాకినాడ కాజాలు, లడ్డూలు, ఇతర స్వీట్లు అందులో ఉన్నాయి. 100 అరటిగెలలు, చీరలు, రవికలు, పండ్లు, పూలు, ఇలా బోలెడు కానుకలు పంపారు.
కరోనా కారణంగా పెళ్లి సింపుల్ గా చేశామని.. ఇప్పుడు లాక్ డౌన్ లేకపోవడంతో ఘనంగా కట్నకానుకలు విందులు చేసుకునేందుకు ఇలా చేసినట్లు వియ్యంకులు తెలిపారు. ఖర్చు ఎంతైనా కానీ సంప్రదాయాలు పాటించాలనే ఇలా భారీ కానుకలు ఇచ్చామన్నారు. గోదావరి జిల్లాలో వీరు పంపిన సారె ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగానూ సంచలనమైంది.