KCR -CBN-Pawan : 2024లో చంద్రబాబును మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారా? భారత రాష్ట్ర సమితి పార్టీని ఏపీలో ప్రారంభించింది అందుకేనా? టిడిపికి కాపు సామాజిక వర్గ ఓట్లను దూరం చేయాలని పకడ్బందీ ప్లాన్ చేశారా? ఇందుకోసం పవన్ కళ్యాణ్ కు 1000 కోట్ల ఆఫర్ ప్రకటించారా? దీనికోసం రంగంలోకి కొంతమంది ఏపీ కాపు నేతల్ని దించారా? వారు జనసేనానికి బ్రెయిన్ వాష్ చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అని సమాధానం చెబుతున్నారు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ.. చంద్రబాబు విషయంలో ఏమాత్రం తడబాటు లేకుండా పచ్చ డప్పు కొట్టడంలో ఆరి తేరిన రాధాకృష్ణ.. రెండో మాట లేకుండానే వీకెండ్ కామెంట్ బై ఆర్కే లో కుండబద్దలు కొట్టాడు.
మొన్న తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించినప్పుడు పోలీసులు ఆయన కాన్వాయ్ అడ్డుకున్నారని, లోకేష్ బాబు యువగళం పాదయాత్రకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తోందని ఆయన వాపోయారు. ప్రతిపక్షం అంటే ఏమాత్రం లెక్క లేదా అంటూ జగన్ పై రంకెలు వేశారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ జగన్ కు శాపనార్థాలు పెట్టారు. ఏమోయ్ జగన్… నీకు మూడింది అంటూ హెచ్చరికలు జారీ చేశారు.. నీకు పాలించడం రాదు వెంటనే దిగిపో అంటూ అల్టిమేటం జారీ చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి జనసేన ను, కాపు సామాజిక వర్గం ఓట్లను దూరం చేసేందుకు కేసిఆర్ కంకణం కట్టుకున్నారని, ఇందుకుగాను పవన్ కళ్యాణ్ కు 1000 కోట్ల ఆఫర్ కూడా ఇచ్చారని రాధాకృష్ణ బాంబు పేల్చాడు. కెసిఆర్ సూచనలతో ఏపీకి చెందిన కొంతమంది కాపు నాయకులు పవన్ కళ్యాణ్ కు బ్రెయిన్ వాష్ చేసే పనిలో పడ్డారని రాధాకృష్ణ సంచలన విషయం బయటపెట్టాడు.. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు నిధులు అందకుండా హైదరాబాదులో స్థిరపడ్డ ఆంధ్ర వ్యాపారులను కట్టడి చేసే పనిలో కేసీఆర్ పడ్డాడు అంటూ రాధాకృష్ణ వివరించాడు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుదే అధికారం అని రాధాకృష్ణ నిర్ణయించేసాడు. ఫర్ డిబేట్ సేక్ ప్రజల్లో అంత బలం ఉన్నప్పుడు, తిరుగులేని మెజారిటీ ఇస్తారనే నమ్మకం ఉన్నప్పుడు ఈ యాత్రలు దేనికి? ఈ సభలు దేనికి? ప్రజలే స్వచ్ఛందంగా ఓట్లు వేసి గెలిపిస్తారని నమ్మకం ఉన్నప్పుడు నిధులు అందకుండా చేస్తారనే అప నమ్మకం ఎందుకు?
అదేంటో కానీ రాధాకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ ఏం జరిగినా తెలిసిపోతుంది. తాను కళ్ళతో చూసినట్టు చెప్తాడు. ఒకవేళ గురి కుదిరితే ఆయన క్రెడిట్. లేకపోతే గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అనే సామెత తీరుగా ఉంటుంది. చేతిలో వందల కోట్ల ప్రాజెక్టులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ వెయ్యికోట్లకు లొంగుతాడా? పోనీ లొంగి పోయాడే అనుకుందాం.. ఆ పవన్ కళ్యాణ్ కేటీఆర్ కు సన్నిహితుడే కదా! అనేరుగా ఆయనతోనే డీలింగ్ పెట్టుకోవచ్చు కదా! మధ్యలో ఈ కాపు సంఘం నాయకుల రాయబారాలు దేనికి? పవన్ కళ్యాణ్ తన్ని తరిమిస్తేనే కదా ఆ తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ గూటికి చేరింది? ఇదే రాధాకృష్ణ తోట చంద్రశేఖర్ కు మియాపూర్ లో దాదాపు 1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారని చెప్పాడు. ఏమాత్రం పబ్లిక్ అప్పియన్స్ లేని చంద్రశేఖర్ కు 1500 కోట్ల భూమి ఇచ్చిన కెసిఆర్.. ఫ్యూచర్ సీఎంగా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ కు 1000 కోట్లు మాత్రమే ఇస్తానని ఆఫర్ ఇచ్చాడా? ఏంటో రాను రాను రాధాకృష్ణ ఏం రాస్తున్నాడో, ఏం చెప్తున్నాడో అర్థం కాకుండా ఉంది.. చంద్రబాబుకు భారీగా జనాలు వస్తున్నారని చెప్పిన రాధాకృష్ణ గుంటూరు, నెల్లూరు ఘటనలను ప్రస్తావించకపోవడం ఆయనలో ఉన్న పచ్చ దారిద్రానికి పరాకాష్ట.