తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు ఏ ఎన్నిక జరిగినా గెలుపు తమదే నంటూ నిమ్మకున్న టీఆర్ఎస్ అధినేత దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తరువాత ఫామ్ హౌజ్ ను వీడనున్నట్లు తెలుస్తోంది. ఇక తాను రంగంలోకి దిగకుంటే పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రహించి పలు కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటున్నారు.
Also Read: ‘గ్రేటర్’పై అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం.. స్పెషల్ పాలనకే మొగ్గు..!
తాజాగా దేశవ్యాప్త బంద్ లో పాల్గొన్న కేసీఆర్ టీంతో ఇక కేంద్రంపై యుద్ధానికి దిగినట్లేనని అర్థమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందే డిసెంబర్ రెండో వారంలో మూడో కూటమి కోసం ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుస్తానన్న కేసీఆర్ కు భారత్ బంద్ అవకాశంగా మారింది.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అంచనాలు దారుణంగా తప్పాయి. దుబ్బాక ఎమ్మెల్యే సీటు కోల్పోయిన కారు పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీసం 90 వరకు సీట్లు కొట్టుకొస్తామని ఘంటాపథంగా చెప్పారు. తాము చేపడుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారని నమ్మబలికారు. కానీ బీజేపీ చేసిన ప్రచారానికి టీఆర్ఎస్ తట్టుకోలేకపోయింది. కనీసం మేజిక్ ఫిగర్ సీట్లు రాబట్టుకోలేకపోవడంతో కేసీఆర్ కు తల తీసేసినట్లయింది. తనకు ఎదురులేదని భావించే ఈ సింహానికి ఒక్కసారిగా రెండు ఎన్నికల్లో దెబ్బకొట్టడం నిద్ర లేకుండా చేసింది.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నోముల నర్సింహ్మయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ఎస్ ప్రతాపం చూపించాలని కేసీఆర్ కత్తులు నూరుతున్నాడు. ఇందుకు తనకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీనే టార్గెట్ చేసుకున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేంద్ర మంత్రులతో సహా ప్రచారం చేయడంతో కేసీఆర్ బీజేపీని టార్గెట్ గా పెట్టుకున్నాడు.
Also Read: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. పరీక్ష పేపర్ల సంఖ్య కుదింపు..?
ఇందులో భాగంగానే మంగళవారం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన బంద్ లో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అండ్ టీం పాల్గొంది. తరువాత ఎలాంటి కేంద్ర వ్యతిరేక కార్యక్రమంలోనైనా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది.
ఇదిలా ఉండగా నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి, అతని కుమారుడు బీజేపీలోకి చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ మాత్రం నాయిని సింపతి ఓట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొన్న జరిగిన రెండు ఎన్నికల్లో హరీశ్ రావు, కేసీఆర్ లకు బాధ్యతలు అప్పజెప్పిన కేసీఆర్ ఈసారి స్వయంగా తానే రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే రైతు బంధు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఖమ్మం, సిద్ధిపేట జిల్లాలకు ఐటీ టవర్లను మంజూరే చేశారు. అయితే నాగార్జున సాగర్ నోటిఫికేషన్ లోగా ఎలాంటి వరాలు ప్రకటిస్తారోనని ఆసక్తి నెలకొంది. మొత్తంగా ఈసారి నాగార్జున సాగర్ లో మాత్రం జెండా పాతనిదే నిద్రపోనని శపథం చేసుకున్నాడని కొందరు టీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్