KCR- BRS National Committees: కుక్కకు బొక్కాశ.. ఇది తెలంగాణలో ప్రాచుర్యంలో ఉన్న సామెత. ఎవరి ఇంట్లో అయితే మాసం వండుతారో.. ఆ వీధిలోని కుక్కలు వాసన పసిగట్టి.. ఆ ఇంటివద్దే తిరుగుతూ ఉంటాయి. బీఆర్‌ఎస్ నేతల పరిస్థితి కూడా ఇప్పుడు కుక్కకకు బొక్కాశ చందంగా మారింది. జాతీయ రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మాచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్‌రావు
దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణ, కార్యకలాపాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో తన జాతీయ పార్టీకి కొత్త కమిటీలను ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. స్వామికార్యం స్వకార్యం రెండూ నెరవేరేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లూ పార్టీ పదవుల కోసం ఎదురు చస్తున్న నేతలు ఈ విషయం తెలుసుకుని బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయానికి క్యూ కడుతున్నారు. శుభాకాంక్షల పేరుతో కేసీఆర్‌ను స్వయంగా కలుస్తున్నారు. కేసీఆర్ కూడా ఎవరినీ కాదనకుండా కలున్నారు. ఈ పదవుల పందేరంలో గులాబీ పార్టీలో అసంతృప్తులకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బీఆర్‌ఎస్‌కు జాతీయ కమిటీలు..
జాతీయ నేతలు లేని జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌కు జాతీయ కమిటీలు ప్రకటించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీకి కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు గులాబీ బాస్. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, వచ్చే ఎన్నికలలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు తగ్గట్టుగా పార్టీ కమిటీలను వేసే పనిలో ఉన్నారు. హిందీ బాగా మాట్లాడగలిగిన వారిని, దేశ రాజకీయాలలో ప్రభావవంతంగా ముందుకు వెళ్లగలిగే వారికి కమిటీలలో స్థానం కల్పించాలని భావిస్తున్నారు.
పదవుల కోసం నాయకుల క్యూ..
ఇక ఈ క్రమంలో ఇప్పటికే గత టీఆర్‌ఎస్, ప్రస్తుత బీఆర్‌ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన, ఎలాంటి పదవులు లేని నాయకుల పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్ల నియామకంతోపాటుగా అనుబంధంగా రైతు విభాగాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో చాలామంది పదవుల కోసం ఇప్పటికే లాబీయింగ్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక కొందరు తమకు హిందీపై పూర్తిగా పట్టు కోసం ట్యూటర్లను పెట్టుకొని మరీ హిందీ నేర్చుకోవడానికి కుస్తీ పడుతున్నారని సమాచారం.
పార్టీ సేవలకు సీనియర్లు..
బీఆర్‌ఎస్ రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి కమిటీలు వేయనున్న గులాబీ బాస్, పార్టీ సీనియర్లకు జాతీయస్థాయిలో అవకాశాలు కల్పిస్తారని తెలుస్తోంది. రాష్ట్రస్థాయి నాయకులకు జాతీయస్థాయిలో అవకాశాలు కల్పిస్తే, రాష్ట్రస్థాయిలో ఏర్పడిన ఖాళీలలో ద్వితీయ శ్రేణి నాయకులతో కూర్పు చేస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నారు. సీనియర్లను జాతీయస్థాయి పదవులు ఇవ్వాలని గులాబీబాస్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కొంతమంది అసంతృప్తులకు పదవులు దక్కే అవకాశం ఉంది. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ అన్ని కులాలు,మతాలు, వర్గాలకు సమతూకంగా పదవులు ఇస్తారని ప్రధానంగా చర్చ జరుగుతుంది.

త్వరలో ప్రకటన
బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు తర్వాత జాతీయ రాజకీయాలపై గట్టిగా ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్, పార్టీ కార్యకలాపాల స్పీడ్ కూడా పెంచుతున్నట్టు తాజా పరిణామాలతో స్పష్టమవుతుంది. మొదటిగా మహారాష్ట్రలోని అమరావతిలో సభను ఏర్పాటు చేసి రంగంలోకి దిగుతున్న కేసీఆర్ ఢిల్లీలోనూ బహిరంగ సభ నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈలోగానే కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు, అందుకోసం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇక బీఆర్‌ఎస్ పార్టీలో ఇప్పటికే చాలా మంది పదవులు రాలేదని తీవ్ర అసహనంతో ఉన్నవారికి, జాతీయ పార్టీ ఏర్పాటు అవకాశం కల్పించడంతో ఆయావర్గాలలో మళ్లీ పదవులకోసం ఆశావహ దృక్పథం కనిపిస్తుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల ప్రకటన వెలువరిస్తారని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.