KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు ఈసాని ఎలాగైనా కేసీర్‌ను గద్దె దించాలని భావిస్తున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్ నాయకులు హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. అయితే ఈ ఎన్నికలు బీఆర్‌ఎస్ – కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఉంటాయని సర్వే సంస్థలు అచనా వేస్తున్నాయి. ఈమేరకు రెండు పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి.
ఉత్తర తెలంగాణలో వ్యతిరేకత..
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఉత్తర తెలంగాణపై మంచి పట్టు ఉంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దక్షిణ తెలంగాణలోని ఖమ్మంలో పార్టీకి పట్టు చిక్కకపోయినా ఉత్తర తెలంగాణ రెండుసార్లు బీఆర్‌ఎస్‌ను గట్టెక్కించింది. కానీ ఈసారి ఉత్తర తెలంగాణలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
అభివృద్ధి అంతంతే..
ఈ ప్రాంతంలోని అనేక కీలకమైన జిల్లాలు ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు. ఈ జిల్లాల్లో ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీల జనాభా ఎక్కువ. వీరి ఓట్లు రాబోయే ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ ప్రాంతాల్లో అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు తీవ్రంగా లేవు. దీంతో ఉత్తర తెలంగాణలో ప్రజలు స్తబ్దతతో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఆదిలాబాద్, కొమరభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మరియు కరీంనగర్ వంటి జిల్లాలు ఉన్నాయి.
కొన్ని జిల్లాల్లోనే అభివృద్ధి..
నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలు అంచలంచెలుగా అభివృద్ధి చెందుతుండగా, మిగిలిన జిల్లాలు తాగునీటి కొరత, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కాకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. ఒకప్పుడు ప్రజలతో బలమైన సంబంధాలను కలిగి ఉన్న నాయకులు, ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లోనూ నైరాశ్యం కనిపిస్తోంది.
పుంజుకున్న కాంగ్రెస్..
ఒకవైపు ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్ బలహీన పడగా, అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. మొన్నటి వరకు బీజేపీ బలంగా కనిపించినా ప్రస్తుతం కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. ఈసారి మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ తర్వాతి స్థానాల్లో ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మొత్తంగా బీఆర్‌ఎస్‌కు బలమైన ప్రాంతంగా ఉన్న ఉత్తర తెలంగాణ ఈసారి ఆ పార్టీకి పరాభవం తప్పేలా లేదు. అభ్యర్థులను మార్చకపోవడం, ప్రభుత్వంపై వ్యతిరేకత, స్థానిక నేతల అరాచకాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వంతపాడడం వంటి కారాణాలు కూడా బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతకు కారణం అంటున్నారు. మరి ఎన్నికల్లో దీనిని బీఆర్‌ఎస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.