KCR Andhra : ఆంధ్రా కోసం మరో భారీ త్యాగం చేస్తున్న కేసీఆర్

KCR Andhra : నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది.. తొలి, మలి దశల్లో ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.. అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటు అయింది.. రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది . రాజకీయ పునరేకీ కరణ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను భారత రాష్ట్ర సమితిలో చేర్చుకున్నది ప్రతిపక్ష పార్టీల్లో తన కోవర్టులను పెట్టుకున్నది. ఇప్పుడేమో దేశ రాజకీయాలను శాసించాలని కలలుగంటున్నది. […]

Written By: Bhaskar, Updated On : January 29, 2023 4:50 pm
Follow us on

KCR Andhra : నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది.. తొలి, మలి దశల్లో ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.. అనేక ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటు అయింది.. రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది . రాజకీయ పునరేకీ కరణ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను భారత రాష్ట్ర సమితిలో చేర్చుకున్నది ప్రతిపక్ష పార్టీల్లో తన కోవర్టులను పెట్టుకున్నది. ఇప్పుడేమో దేశ రాజకీయాలను శాసించాలని కలలుగంటున్నది. మోదీని గద్దె దించాలని మంగమ్మ శపథాలు చేస్తున్నది. సరే ఇదంతా ఒక కోణం. కానీ ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ ఉద్యమం పుట్టిందో… ఇప్పుడు ఆ నీళ్లనే ఆంధ్రకు అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ఏకంగా సెక్షన్ 3 పై పోరుకు భారత రాష్ట్ర సమితి బ్రేక్ వేయడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. కృష్ణా జలాల వివాదం పరిష్కారం కోసం కొత్త ట్రిబ్యునల్ వేయాల డిమాండ్ పై కూడా సర్కార్ మౌనం వహిస్తోంది.. అంతేకాదు అధికారులు ఫైలు మొత్తం సిద్ధం చేసినప్పటికీ ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం.. మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నందునే ఔదార్యం చూపిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.

భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ప్రయత్నంలో ఉన్న సీఎం కేసీఆర్ కు… ఆంధ్రప్రదేశ్ పై ఉదారత చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడికి విలువైన భూములు కేటాయించినట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. దీనికి తోడు కృష్ణా వివాదం పరిష్కారం కోసం జరిపే పోరాటంలోనూ కెసిఆర్ వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది.. అంతర్రాష్ట్ర నది జలాల వివాదాల చట్టం-1956 లోని సెక్షన్_3 ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్ వేయాలని లేదా ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు బాధితులు అప్పగించాలని తెలంగాణ కోరుతున్న విషయం తెలిసిందే.. ఇందుకోసం మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టాలని నిర్ణయించింది.. ఈ మేరకు అధికారులు రెండు నెలల కిందటే కేసుకు సంబంధించిన అఫిడవిట్లన్నీ సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు..

భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ స్థాయికి వెళుతున్నందున నది జలాల విషయంలో విశాల దృక్పథంతో వ్యవహరించాలని కెసిఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.. ఇందులో భాగంగానే కృష్ణా జలాలపై ఉద్యమాలు కాకుండా ఉదారత చూపించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.. వాస్తవానికి సెక్షన్ 3 పై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని.. గత ఏడాది నవంబర్ నెలలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. దీంతో అధికారులు ఫైలు మొత్తం సిద్ధం చేశారు.. మళ్లీ ప్రభుత్వ అనుమతి కోసం పంపించారు.. అయితే భారత రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత కృష్ణా జలాలపై ప్రభుత్వ వైఖరి మారిందని, ఆ కారణంగానే కేసు దాఖలు చేసేందుకు సీఎం నుంచి ఆదేశాలు రాలేదని అధికారులు అంటున్నారు. భారత రాష్ట్ర సమితిలోకి ఆంధ్రప్రదేశ్ నుంచి చేరికలు పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జలాలపై నోరు ఎత్తితే ఆ రాష్ట్రంలో పార్టీకి ఇబ్బందులు వస్తాయనే కారణంతోనే ట్రిబ్యునల్ పై కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.

బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా జలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గంపగుత్తగా 811 టిఎంసిలు కేటాయించింది..ఆ నీటిలో కచ్చితంగా 50% వాటా ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది..2015, 2017 లో నీటి పంపకాల కోసం ఒప్పందాలు చేసుకున్నా.. అవి ఆ సంవత్సరాల కోసం తాత్కాలికంగా చేసుకొన్నవేనని చెబుతోంది. 50 శాతం వాటా కోసం రెండు సంవత్సరాలుగా కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలోనూ తెలంగాణ బలంగా పట్టుబడుతున్నది.. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం ఉన్నప్పుడు దానిని పరిష్కరించేందుకు అంతర్రాష్ట్ర నది జలాల వివాదాల చట్టం 1956 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ వేయడానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం వెసలు బాటు కల్పించింది.. ఈ మేరకే చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ వేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

మరోవైపు కృష్ణా జలాల వివాదం పరిష్కారం కోసం కొత్తగా ట్రిబ్యునల్ వేయడం లేదా ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కే పంపిణీ అవకాశాన్ని అప్పగించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నెల రోజులకే కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్రం ఏపీ అభిప్రాయం కోరగా.. రాష్ట్రం అభ్యంతరం తెలిపింది.. ఓ దశలో సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్ కోసం తెలంగాణ వేసిన పిటీషన్ ను కూడా వెనక్కి తీసుకోకుండా విచారణ కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ గట్టిగా పట్టుబట్టింది. దీంతో సెక్షన్ 3 పై సుప్రీంకోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకుంటే ట్రిబ్యునల్ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం భరోసా ఇచ్చింది.. కానీ తెలంగాణ ప్రభుత్వం కేసును వెనక్కి తీసుకున్న తర్వాత.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కార్యకలాపాలు కొనసాగుతున్నందున కొత్తగా మరో ట్రిబ్యునల్ అక్కర్లేదంటూ కేంద్రం షాక్ ఇచ్చింది. దీంతో కంగు తినడం తెలంగాణ వంతు అయింది.. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర కింద జరిగిన మంత్రివర్గ సమావేశంలో కృష్ణా జలాలపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.. ఈ మేరకు మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.. కానీ తాజాగా మారిన రాజకీయ కారణాల నేపథ్యంలో ఏసు జోలికి వెళ్ళకూడదనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.