Homeజాతీయ వార్తలుKCR On AP: తెలంగాణ కోసం ఆంధ్రాను బలిచేస్తున్న కేసీఆర్‌.. మళ్లీ గెలిస్తే ఏపీకి ముప్పే..!

KCR On AP: తెలంగాణ కోసం ఆంధ్రాను బలిచేస్తున్న కేసీఆర్‌.. మళ్లీ గెలిస్తే ఏపీకి ముప్పే..!

KCR On AP: కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సారథిగా, స్వరాష్ట్ర సాధకుడిగా, తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది. ఇదే ధీమాతో మూడోసారి తెలంగాణలో గెలుస్తామని అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. విపక్షాలకంటే దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తెలంగాణ మోడల్‌ను చూసి జాతీయ రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రయత్నించారు. ఈమేరకు మహారాష్ట్రలో పార్టీ విస్తరణ చేపట్టారు. అక్కడ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిని కూడా నియమించారు. నాలుగైదు సభలు పెట్టారు. తెలంగాణ తరహాలో మహారాష్ట్ర అభివృద్ధి చెందాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నారు.

ఆంధ్రాలోనూ బీఆర్‌ఎస్‌..
ఇక ఆంధ్రాలోనూ బీఆర్‌ఎస్‌ విస్తరణకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ఏపీకి అధ్యక్షుడిని కూడా నియమించారు. అసలు ఆంధ్రాతో కలిసి ఉండలేమనే తెలంగాణ ఉద్యమం చేసి స్వరాష్ట్రం సాధించుకున్న కేసీఆర్‌ మళ్లీ ఆంధ్రాలో రాజకీయం చేయడమే ఆశ్చర్యం వేస్తోంది. ఆంధ్రాలోనూ అధికారంలోకి రావాలనుకుంటే తెలంగాణ, ఆంధ్రాను మళ్లీ విలీనం చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా పాలించుకోవచ్చు. కానీ అలా చేయకుండా జాతీయ రాజకీయాలంటూ ఆంధ్రాలో అడుగు పెట్టాలని చూడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రాజధానికి అడ్డుపుల్ల..
ఏపీలో బీఆర్‌ఎస్‌ అడుగుపెట్టడాన్ని కేసీఆర్‌ తన మాటకారితనంతో ఎంత చక్కగా సమర్ధించుకున్నప్పటికీ, ఆయన వలన ఏపీకి తీవ్రంగా నష్టం జరుగుతోంది. బాధాకరమైన విషయం ఏమిటంటే, గత ఎన్నికల్లో ఆయన చేసిన తెరచాటు రాజకీయాలతో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం నిలిచిపోయింది. పరోక్షంగా అమరావతికి అడ్డుపుల్ల వేసింది కేసీఆరే. మరోవైపు ఏపీలో అభివృద్ధి కుంటుపడింది. ఇందుకు కూడా పరోక్షంగా బీఆర్‌ఎస్‌ అధినేతే కారణం. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులు తెలంగాణకు తరలిపోతున్నాయి. ఈ కారణంగా ఏపీలో దాదాపు ప్రతీ కుటుంబంలోని యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కే వలస పోవాల్సి వస్తోంది. జాతీయ స్పూర్తి, సమగ్రత, దేశాభివృద్ధి గురించి గొప్పగా చెప్పే కేసీఆర్‌ ఏపీ విషయానికి వచ్చేసరికి కేసీఆర్‌లోని ‘అచ్చమైన తెలంగాణ వాది’ బయటకు వస్తుంటాడు.

బకాయిలు చెల్లించకుండా..
విభజన చట్ట ప్రకారం ఆస్తుల పంపకాలు, ఏపీకి చెల్లించాల్సిన రూ.6 వేల కోట్ల బకాయిలు, నదీ జలాలలో వాటాలు ఇంకా చాలా సమస్యలు అందుకే అపరిష్కృతంగా ఉండిపోయాయి. తెలంగాణలో కేసీఆర్‌ శరవేగంగా అతిభారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తూ కృష్ణ, గోదావరి నదీజలాలను రాష్ట్రంలో అన్ని జిల్లాలకు పారించుకుంటున్నారు. అందుకు ఆయనను తప్పక అభినందించాల్సిందే. కానీ దిగువనున్న ఆంధ్రా పరిస్థితి ఏమిటి?ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు కరువుతో అల్లాడాల్సిన పరిస్థితి. కేసీఆర్‌ యథేచ్చగా కృష్ణా జలాలను తరలించుకుపోతున్నా జగన్‌ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం లేదు.

కృతజ్ఞత చూపుతున్న జగన్‌..
కృష్ణా జలాల విషయంలో జగన్‌ మౌనానికి అసలు కారణం గత ఎన్నికల్లో కేసీఆర్‌ సహకరించడమే అని తెలుస్తోంది. అందుకు కృతజ్ఞతగానే జగన్‌ ఆంధ్రా, రాయలసీమ రైతులకు అందాల్సిన నీటిని వదిలేసి కృతజ్ఞత చూపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోమారు కూడా వైసీపీని గెలిపించడానికి బీఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందం కొనసాగుతోందని పలువురు పేర్కొంటున్నారు.

కేసీఆర్‌తీరుతో ఆంధ్రాకు నష్టం..
కేసీఆర్‌ తన రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారు. ఆయన ‘తెలంగాణ భక్తి’ని, తన రాష్ట్రం పట్ల నిబద్ధతను మెచ్చుకో వాల్సిందే. కానీ ఆయన ఏపీని అనేక విధాలుగా దెబ్బతీస్తున్నారు. ఈ విషయం తెలిసి కూడా మౌనం వహిస్తున్న వైసీపీ ప్రభుత్వం గురించి ఆంధ్రా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. జగన్‌ ఆంధ్ర ప్రయోజనాలు, ప్రజల కంటే వైసీపీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌ పాలిట శాపంగా మారడం ఖాయం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version