Liquor Rates: దేశంలో మద్యం ధరలు ఎక్కడ తక్కువ.. కారణమేంటి.. ఎక్కడ ఎక్కువ కొనొచ్చంటే?

గోవాలో తక్కువ ధరకు మద్యం లభించడం వల్లే గోవా నుంచి మద్యం కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా విక్రయిస్తున్నారని నివేదిక పేర్కొంది.

Written By: Raj Shekar, Updated On : September 26, 2023 4:13 pm

Liquor Rates

Follow us on

Liquor Rates: లిక్కర్‌.. ఒకప్పుడు ధన వంతులకు మాత్రమే పరిమితం. కానీ నేడు ఆ లిక్కరే ప్రభుత్వాలను నడిపిస్తోంది. అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది. మందుబాబులు పెరగడంతో ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వస్తోంది. దేశంలో అత్యధిక మంది మద్యం తాగే రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఇక్కడ మద్యం ధరలు పెంచినా తాగడం మాత్రం తగ్గడం లేదు. తాజాగా డిసెంబర్‌ నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. ఎన్నికల నేపథ్యంలో ధరలు పెరిగే అవకాశం తక్కువ. అయితే.. ఎన్నికల తర్వాత పెరుగుతాయని తెలుస్తోంది. పొరుగు రాష్ట్రం ఆంధ్రాలోనూ మద్యం ధరలు భారీగా ఉన్నాయి. తెలంగాణ ధరలకన్నా ఎక్కువగా ఉండడంతో సరిహద్దు జిల్లాల వారు తెలంగాణ నుంచి మద్యం తీసుకెళ్తున్నారు. ఇక తెలంగాణ పొరుగున ఉన్న మహారాష్ట్రలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి తెలంగాణ వాసులు మద్యం తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మద్యం ధరలు ఎక్కడ తక్కువ ఉంటాయన్న చర్చ జరుగుతోంది. మరి ఎక్కడ తక్కువ ఉంది.. అందుకు కారణం ఏమిటో చూద్దాం.

గోవాలోనే మద్యం చీప్‌..
గోవాలో లిక్కర్‌ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ ఆల్కహాల్‌పై చాలా తక్కువ పన్నులు వసూలు చేస్తున్నారు. లిక్కర్‌పై ఎక్కువగా ట్యాక్స్‌లు వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక టాప్‌ ప్లేస్‌లో నిలుస్తోంది. దీంతో బీచ్‌లు, మద్యపానాన్ని ఇష్టపడే వారికి గోవా బెస్ట్‌ ప్లేస్‌ అవుతుంది. ఎందుకంటే భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో మద్యం చాలా చౌకగా దొరుకుతుంది. ఇక్కడ మద్యంపై పన్నులు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

ట్యాక్సులతోనే ధరలు ఎక్కువ..
వాస్తవానికి మద్యం తయారీకి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ప్రభుత్వాలు వసూలు చేసే ట్యాక్స్‌ల కారణంగానే ధరలు పెరుగుతాయి. ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్‌ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన సర్వే ప్రకారం.. గోవాలో ఆల్కహాల్‌పై చాలా తక్కువ పన్నులు వసూలు చేస్తున్నట్లు తేలింది.

ట్యాక్స్‌లో కర్ణాటక టాప్‌..
లిక్కర్‌పై ఎక్కువగా ట్యాక్స్‌లు వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక టాప్‌ ప్లేస్‌లో నిలుస్తోంది. కాబట్టి అక్కడ ధరలు గోవాతో పోల్చుకుంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే గోవాలో రూ.100 ఉన్న మద్యం బాటిల్‌ ఢిల్లీలో రూ.134, కర్ణాటకలో రూ.513 పలుకుతుంది. ఎందుకంటే, మద్యంపై పన్నులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్‌ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం మద్యంపై గోవా గరిష్ట రిటైల్‌ ధరలో 49% లెవీస్‌ వసూలు చేస్తే, కర్ణాటక 83%, మహారాష్ట్ర 71% పన్నులు వసూలు చేస్తున్నాయి. పన్నులలో ఈ వ్యత్యాసం ధరలలో భారీ తేడాకు దారితీస్తుంది. ఉదాహరణకు బ్లాక్‌ లేబుల్‌ స్కాచ్‌ విస్కీ బాటిల్‌ ఢిల్లీలో రూ.3,100 అయితే ముంబైలో రూ.4 వేలు ఉంది. మద్యంపై తక్కువ పన్నులు ఉన్న రాష్ట్రాల్లో నివసించే వారి కంటే మద్యంపై ఎక్కువ పన్నులు ఉన్న రాష్ట్రాల్లో నివసించే ప్రజలు ఎక్కువ చెల్లించుకోవలసి ఉంటుంది.

అందుకే గోవా నుంచి తెచ్చుకుంటారు..
గోవాలో తక్కువ ధరకు మద్యం లభించడం వల్లే గోవా నుంచి మద్యం కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా విక్రయిస్తున్నారని నివేదిక పేర్కొంది. దీన్ని స్మగ్లింగ్‌ లేదా బూట్‌లెగ్గింగ్‌ అంటారు. ఇది నేరం. వస్తు సేవల పన్నులో మద్యం, పెట్రోల్‌ను చేర్చలేదని నివేదిక ప్రస్తావించింది.

జీఎస్టీ పరధిలో లేక..
జీఎస్టీ అనేది భారతదేశంలో అన్ని వస్తువులు, సేవలపై ఒకే పన్ను రేటు ఉండేలా చేసే పన్ను వ్యవస్థ. అయితే జీఎస్టీ పరిధిలో మద్యం, పెట్రోలియం లేకపోవడం వల్ల వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పన్నులు విధిస్తున్నారు. దీంతో మద్యం, పెట్రోలు కొనుగోలు చేసే, విక్రయించే వారికి అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం మద్యం, పెట్రోల్‌ను జీఎస్టీలో చేర్చాలని నివేదిక సూచించింది. ఇది పన్ను రేట్లు ఒకేలా మార్చడంతోపాటు అక్రమ రవాణాను తగ్గిస్తుంది. పన్నుల ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని ఆర్జించడాన్ని సులభతరం చేస్తుందని తెలిపింది.