KCR – Early Elections: ” సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తాం. కచ్చితంగా 100 స్థానాలు గెలుస్తాం. మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోం” ఇవి ఇటీవల టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. కానీ ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్టింగ్ లకు టికెట్లు ఇస్తారా? ఇవ్వరా అనేది పక్కన పెడితే.. కెసిఆర్ ముందస్తు ఎన్నికలకే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే జిల్లాల్లో మూడు సంవత్సరాలకు మించి బాధ్యతల్లో ఉన్న కలెక్టర్లను బదిలీ చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఎన్నికలు గనుక వస్తే ఇలాంటివారికి స్థాన చలనం తప్పదు. అందుకే ఇప్పుడు మార్పులు చేస్తే అప్పటికి ఇబ్బంది ఉండదని కేసీఆర్ భావిస్తున్నారు. తన, పర భేదాలు బేరీజు వేసుకొని బదిలీలకు అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎవరి సేవలు ఎక్కడ అవసరం పడతాయో పూర్తి వివరాలతో జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.. 2018 ఎన్నికలకు ముందు కూడా ప్రభుత్వం ఇలాగే చేసింది.. అయితే దీనికి సంబంధించి సీఎంవో ఆఫీస్ కి ఫైల్ వెళ్ళింది. దీనిపై కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

బదిలీలకు రంగం సిద్ధం
ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉండడంతో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఏ అధికారి సేవలు ఎక్కడ అవసరం? ఎవరి రికార్డు ఎలా ఉంది? ఏ అధికారికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రులతో విభేదాలు ఉన్నాయి? వివరాలతో పూర్తి జాబితా సిద్ధమైంది. మరీ ముఖ్యంగా కొన్ని జిల్లాల కలెక్టర్ల పదవీకాలం మూడేళ్లకు మించిపోయింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగేందుకు ముందు ఏ జిల్లా కలెక్టరైనా ఆ జిల్లాలో మూడేళ్లకు మించి ఉండకూడదు. ఈ నిర్దేశిత గడువు దాటిందంటే వెంటనే ఆ కలెక్టర్ ను బదిలీ చేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మూడేళ్ల కాలం దాటిన కలెక్టర్లందరినీ ప్రభుత్వం బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి ఎన్నికల బదిలీలకు ముందే ప్రభుత్వం చాలా మందికి స్థానచలనం కల్పించనుంది. దీనికి సంబంధించిన ఫైల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు . ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉంది.
కొత్త మార్పులు
సీనియర్ అధికారులపై ఎక్కువ భారం ఉండడంతో ప్రభుత్వం భారీగా బదిలీలు చేయాలని యోచిస్తోంది. మరోవైపు 9,000 పై చిలుకు గ్రూప్_ 4 పోస్టుల భర్తీ, ఆసుపత్రుల కోసం 4,000 పోస్టుల భర్తీకి అనుమతుల మంజూరు, పోడు భూములకు పట్టాలు ఇవ్వడం… తదితర అంశాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. అయితే ఇవన్నీ కూడా ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సాగుతున్నాయనే చర్చ జరుగుతోంది. పెద్ద సంఖ్యలో ఐఏఎస్ లను బదిలీ చేయడంలో కూడా ఆంతర్యం ఇదే అనే వాదన కూడా ఉంది.

గతంలో మాదిరే
రాష్ట్రంలో భారీ సంఖ్యలో అధికారుల బదిలీ జరిగి చాలా కాలం అవుతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకేసారి 50 మందికి పైగా ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు కూడా ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో తన, పర భేదాలు బేరీజు వేసుకొని బదిలీలు చేపడతారని సమాచారం. కీలకమైన బాధ్యతలు తమకు అనుకూలమైన అధికారులకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. కొంతమంది సీనియర్ అధికారుల వద్ద ఒకటి కంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి.. ముఖ్యంగా సోమేశ్ కుమార్ పైన అధిక భారం ఉంది.. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలను కూడా చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ అధికారిగా కూడా ఉన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కు అదనంగా హెచ్ఎండీ ఏ కమిషనర్ బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యదర్శిగా రాహుల్ బొజ్జా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చూడాల్సి వస్తోంది. సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ కాలేజీయెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా కొనసాగుతున్నారు. ఆయనకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి గాను అదనపు బాధ్యతలు ఉన్నాయి.. ఈ క్రమంలో వారిపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త అధికారులను నియమించనుంది.. ఇక తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్, మెదక్ జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది..