KTR: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పక్షం రోజులుగా గడప దాటడం లేదు. ఆయనకు జ్వరం వచ్చిందని పది రోజుల క్రితం చెప్పిన కేటీఆర్ తాను, తన బావ హరీశ్‌రావుతో కలిసి ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నారు. కృష్ణార్జునుల తరహాలో బావ, బావమరుదులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోపాటు చేసిన అభివృద్ధి చెబుతూ ఓట్లు అడుగుతున్నారు. తాజాగా కేసీఆర్ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని తాజాగా కేటీఆర్ ప్రకటించారు. ఆయనకు ఛాతీలో ఇన్‌ఫెక్షన్ సోకిందని వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని జాతీయ మీడియాకు వెల్లడించారు. అందుకే కేసీఆర్ బయటకు రావడం లేదు.
పార్టీ నిర్ణయాలు ఆయనే..
పార్టీ వ్యవహారాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. అనారోగ్యం కారణంగా కేసీఆర్ పూర్తి స్థాయిలో ఇంటికే పరిమితమవుతారని.. కేటీఆరే ఎన్నికల వ్యవహారాన్ని నడుపుతారని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కేటీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఓ రకంగా ప్రచారాన్ని డీల్ చేస్తున్నారు. కేసీఆర్ రాకపోయినా ఆ లోటు లేకుండా చూసేలా వ్యవహరిస్తున్నారు. పార్టీ నేతలకు కేటీఆర్ ఉన్నా పర్వాలేదన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు.
నెక్ట్స్ సీఎంగా ప్రమోషన్..
ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే వచ్చే ఎన్నికల తర్వాత కేటీఆరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి తగ్గట్లుగా వ్యూహాలు అమలు చేస్తున్నారని భావిస్తున్నారు. గతంలో ములాయం సింగ్ యాదవ్ ఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని పూర్తిగా అఖిలేష్ యాదవ్ నడిపారు. ఎస్పీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అయ్యారు. ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలోనూ అదే వ్యూహం అవలంభిస్తున్నారని.. ఒకటి, రెండు సభల్లో కేసీఆర్ పాల్గొన్నా.. మొత్తం కేటీఆర్ చేతుల మీదుగా నిర్వహించి.. గెలిచిన తర్వాత కిరీటం పెట్టేస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి.