KCR- Chandrababu: చంద్రబాబు పేరు ఎత్తితేనే అంతెత్తున ఎగిరిపడే కేసీఆర్ ఇప్పుడు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారా? ఆయన అనుసరించిన విధానాలనే పాటిస్తున్నారా? అంటే ఇందుకు అవుననే సమాధానం వస్తోంది.. సంక్రాంతి తర్వాత 18న కెసిఆర్ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అంతకుముందే భద్రాద్రి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించి, మెడికల్ కాలేజీ నూతన భవనానికి శంకుస్థాపన చేస్తారు.. ఆ తర్వాత ఆయన ఖమ్మంలో సభ నిర్వహిస్తారు.. ఇందుకుగాను ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో భారత రాష్ట్ర సమితి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

బాబు బాటలోనే…!
గత ఏడాది డిసెంబర్లో ఇదే మైదానంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అశేష సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. దీంతో అప్పటిదాకా స్తబ్దంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాలో పుంజుకోవడం ప్రారంభించింది.. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంగా ఉండటం, సెటిలర్స్ కూడా ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు సభతో ఒక్కసారిగా ఊపు వచ్చింది. అయితే చంద్రబాబు సభకు తెరవెనుక భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా సహకరించారనే ఆరోపణలు రావడంతో కెసిఆర్ అప్రమత్తమయ్యారు. పైగా ఈ ప్రాంతంలో ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి అవసరం.. మొన్న కొనుగోలు చేసిన విమానానికి ఆ నేతలే భారీగా విరాళాలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ తన పటిష్టతను కోల్పోతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించిన కేసీఆర్ ఖమ్మం నుంచే భారత రాష్ట్ర సమితి ప్రస్థానాన్ని మరింత పటిష్టం చేయాలని సంకల్పించినట్లు తెలుస్తోంది.

కమ్యూనిస్టులను పిలుస్తారా?
భావసారూప్యత ఉన్న పార్టీల నాయకులతో తాము కలిసి పని చేస్తామని చెబుతున్న కేసీఆర్… ఖమ్మంలో నిర్వహించే సభకు కమ్యూనిస్టులను ఆహ్వానించే అవకాశం కల్పిస్తోంది. పైగా మునుగోడు ఉప ఎన్నికల విజయం తర్వాత ఆ సూది, దబ్బుణం పార్టీలతో భారత రాష్ట్ర సమితి నాయకులు మరింత బంధాన్ని ఏర్పరచుకున్నారు.. ఖమ్మం లాంటి ప్రాంతంలో వారి సహకారం అవసరం గనుక కేసీఆర్ కూడా ఆ దిశగానే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలతో రవాణా శాఖ మంత్రి తువ్వాడ అజయ్ కుమార్ ఒక దఫా చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ఒకప్పుడు తన గురువుగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లోనే ఇప్పుడు కేసీఆర్ నడవడం మారిన రాజకీయాల వైచిత్రికి అద్దం పడుతున్నది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు కానీ.. ఇప్పుడైతే రాజకీయాల్లో రసవత్తర చర్చకు కారణమవుతోంది.