BRS Meeting On Khammam: భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తర్వాత సీఎం కేసీఆర్ రాజకీయంగా వేగం పెంచుతున్నారు.. ఇందులో భాగంగా వరుస సమీక్షలు, భేటీలు జరుపుతున్నారు.. కానీ ఎన్నడూ భారీ సభలు ఏర్పాటు చేయలేదు.. అయితే పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఆయన నడుం బిగించారు.. సంక్రాంతి తర్వాత ఖమ్మంలో ఏకంగా ఒక భారీ సభను నిర్వహించబోతున్నారు.. దీంతో తెలంగాణ రాజకీయాల్లో వాతావరణం వేడెక్కింది. పైకి మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవం అని చెబుతున్నప్పటికీ లోపల అసలు అంతరార్థం వేరే ఉంది.

ఇక్కడి నుంచి సంకేతాలు
తెలంగాణ మొత్తం పోలిస్తే ఖమ్మం పూర్తి విభిన్నమైన ప్రాంతం. 2018 ఎన్నికల్లో రాష్ట్ర మొత్తం కారు హవా నడిస్తే.. ఖమ్మంలో మాత్రం ప్రతిపక్షాల జోరు కొనసాగింది.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలు అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చాయి. మరోవైపు ఇక్కడ పార్టీలో నెలకొన్న లుకలుకలు అధినేతను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వామికార్యం, స్వకార్యం నెరవేర్చుకునేందుకు కేసీఆర్ ఏకంగా ఇక్కడ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇతర ముఖ్య నాయకులు ఆదివారం హైదరాబాద్లో వరంగల్, ఇతర ప్రాంతాలకు చెందిన కీలక నాయకులతో సమావేశమయ్యారు.. పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.. అయితే వీరి మధ్య జరిగిన భేటీలో ఇతర రాష్ట్రాల రాజకీయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.. కెసిఆర్ సభ సందర్భంగా పంజాబ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని భావ సారూప్యత ఉన్న నాయకులను ఆహ్వానించాలని చర్చించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని కెసిఆర్ కు చెప్తే ఆయన వద్ద నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది.
ఇక్కడి నుంచే ప్రకటన
ఇక ఖమ్మం సభ ద్వారా భద్రాచలానికి సరిహద్దులో ఉన్న ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.. అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మంది నాయకులు భారత రాష్ట్ర సమితిలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ నాయకులతో ఒక దఫా మంతనాలు కూడా పూర్తి చేశారు.. ఖమ్మం సభలో ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన నాయకులు కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
పొంగులేటికి ఆహ్వానం ఉంటుందా
నూతన సంవత్సరం నుంచి భారత రాష్ట్ర సమితి అధినాయకత్వంపై విమర్శలు ఎక్కు పెట్టిన పార్లమెంట్ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈ సభకు ఆహ్వానం ఉంటుందా అంటే? ఉండదనే సమాధానం వస్తోంది. ప్రభుత్వం ఆయనకు భద్రతా సిబ్బందిని తగ్గించడంతో పొంగులేటికి, భారత రాష్ట్ర సమితికి మధ్య వైరం ముదిరి పాకానపడిందని అవగతమైంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో తన అనుచరులు మొత్తం పోటీ చేస్తారని సంకేతాలు ఇచ్చారు.. కొన్ని సందర్భాల్లో బాహాటంగానే చెబుతున్నారు. దీనికి ఆ జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు..

తుమ్మల నారాజ్
ఇక తుమ్మల నాగేశ్వరరావు కూడా అధిష్టానం పై నారాజ్ ఉన్నారు.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన అంత చురుగ్గా పాల్గొనడం లేదు. పైగా వాజేడు, బార్గూడెంలో ఆయన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారాయి.. మరోవైపు ఆయన అనుచరులు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. గతంలో మండల పార్టీ అధ్యక్షుల నియామకంలో కూడా రచ్చ రచ్చ చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ తుమ్మలను దూరం పెడుతున్నారని తెలుస్తోంది.. గత ఏడాది భద్రాచలం గోదావరి వరదలకు సంబంధించి నిర్వహించిన సమీక్షలను తుమ్మల చెప్పిన మాటలను కెసిఆర్ అంతగా పరిగణనలోకి తీసుకోలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని తుమ్మల చెప్పడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లు ఇస్తామని కెసిఆర్ హామీ ఇవ్వడం గమనార్హం. అయితే 18న నిర్వహించే సభకు తుమ్మలకు ఆహ్వానం ఉంటుందా లేదా అనేది ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.. ఏది ఏమైనప్పటికీ భారత రాష్ట్ర సమితి ని బలోపేతం చేసేందుకు ఖమ్మం నుంచి కేసీఆర్ శంఖారావం పూరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.