Chandrababu- Pawan Kalyan Meet: ఏపీ పొలిటికల్ సర్కిల్ లో చంద్రబాబు, పవన్ హీట్ పెంచారు. పొత్తుల చిక్కుముడులను విప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇందులో లాభనష్టాల పక్కనపెడితే మాత్రం వారిద్దరి కలయిక అధికార వైసీపీని కలవరపెడుతోంది. అయితే ఎప్పటి నుంచో దీనిపై అధికార పార్టీకి క్లారిటీ ఉన్నట్టుంది. అందుకే అవకాశం వచ్చినప్పుడల్లా పొత్తులపై మాట్లాడుతూ వస్తున్నారు. ఆ రెండు పార్టీల కలయికపై మంత్రులు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. పైకి జీవో నంబర్ 1 పేరిట చంద్రబాబును అడ్డుకున్నందుకు సంఘీభావం తెలపడానికి వచ్చినట్టు పవన్ చెబుతున్నా.. ఇది పక్క రాజకీయ సమావేశమంటూ అధికార పార్టీ విమర్శల డోసు పెంచుతోంది. దత్త తండ్రి దగ్గరకు దత్త పుత్రుడు చేరాడంటూ తన పాత కామెంట్స్ నే రిపీట్ చేస్తోంది.

జగన్ సర్కారు అప్రజాస్వామిక చర్యలపై పోరాటం చేస్తామని, ఐక్యతగా ముందుకు సాగుతామని ఇరువురు నేతలు భేటీ తరువాత మీడియాకు వెల్లడించారు. కానీ పొత్తులపై ఇరు పార్టీలకు స్పష్టమైన సంకేతాలు పంపినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. పొత్తుల విషయంలో పవన్ ఒక అడుగు ముందుకేసినట్టు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకూ చంద్రబాబు పవన్ ను కలిసేందుకు ఆరాటపడేవారు. కానీ ఫస్ట్ టైమ్ పవన్ చంద్రబాబు గుమ్మం తొక్కడంతో ఇక పొత్తులు లాంఛనమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ పొత్తుల గురించి అచీతూచీ మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబును కలవడం, జగన్ సర్కారుపై పోరాటానికి పిలుపునివ్వడంతో బీజేపీ పాత్ర ఏమిటనేది తేలాల్సి ఉంది.
అయితే చంద్రబాబు, పవన్ ల కలయిక అధికార వైసీపీని కలవరపెడుతోంది. అది మేము ఊహించిందేనని మంత్రులు ప్రకటించారు. వారి భేటీని తప్పుపడుతూ రకరకాలుగా కామెంట్స్ మొదలుపెట్టారు. జగన్ ను ఓడించేందుకు వారు మహా కూటమిని ఏర్పాటుచేస్తారని చెప్పుకొచ్చారు. పొత్తు కుదిరిపోయిందని.. ఇక సీట్ల పంపకమే తరువాయి అని అభిప్రాయపడుతున్నారు. త్వరలో ఆ రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశముందని కూడా నమ్ముతున్నారు. చంద్రబాబుతో పవన్ కొద్దిసేపే మాట్లాడినా రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ పై విష ప్రచారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు పచ్చ మీడియా పిచ్చి రాతలతో జనసేనను పలుచన చేసే ప్రయత్నం మొదలుపెట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకు 30 అసెంబ్లీ, 5 నుంచి 8 వరకూ ఎంపీ స్థానాలు ఇవ్వనున్నట్టు కథనాలను వండి వార్చుతోంది. అక్కడితే ఆగకుండా టీడీపీతో పొత్తును జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ వ్యతిరేకిస్తున్నారని ప్రచారం ప్రారంభించారు. అందుకే చంద్రబాబుతో కీలక భేటీకి డుమ్మా కొట్టారని అనుమానిస్తున్నారు. విశాఖ ఘటన తరువాత విజయవాడ హోటల్ లో బస చేస్తున్న పవన్ ను చంద్రబాబు కలిసేటప్పుడు అన్నీ తానై వ్యవహరించిన మనోహర్ ఇప్పుడు లేకపోవడం ఏమిటన్న కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఆయనకు ఇష్టం లేనందునే రాలేదని ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ప్రస్తుతం నాదేండ్ల మనోహర్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. పార్టీ యువశక్తి కార్యక్రమం ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. గత మూడు రోజులుగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అందుకే ఆయన ఈ భేటీలో కనిపించలేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అటు మనోహర్ కూడా పవన్, చంద్రబాబు భేటీల వివరాలను తెలుసుకుంటున్నారని.. పచ్చ మీడియా జనసేనలో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని జన సైనికులు ఆరోపిస్తున్నారు.