
తెలంగాణ కేబినేట్ వరుసగా సమావేశం అవుతోంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ‘ఫుడ్ ప్రాసెసింగ్’, ‘తెలంగాణ లాజిస్టిక్ పాలసీ’కి మంత్రులు ఆమోదం తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ అవసరమని కేబినెట్ నిర్ణయించింది. అలాగే పారిశ్రామిక రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆ రకంగా అభివృద్ధి చెందడానికి కొత్త విధానం అవసరమని కేబినేట్ గుర్తించింది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ఈ రెండు విధానాలకు ఆమోదం తెలిపినట్లు ప్రకటన వెలువడింది.
రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో పంట దిగుబడి పెరుగుతోంది. దీంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దశలో 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2024-2025 సంవత్సరం వరకు 10 వేల హెక్టార్లలో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అధిక మొత్తంలో పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన వారికి ప్రోత్సాహకాలు అందించనున్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ప్రభుత్వం భూమిని సేకరించి సుమారు రూ.25 వేల కోట్ల పెట్టుబడులను పెట్టేలా లక్ష్యం పెట్టుకున్నారు. అంతేకాకుండా 70 వేల మందికి ప్రత్యక్షంగా.. 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించేలా ప్రణాళిక వేయనున్నారు. ఇక విదేశాలకు ఎగుమతి చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ప్రత్యేకంగా ప్రభుత్వమే షెడ్లను నిర్మించి వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవం తీసుకురానున్నారు.
పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందేందుకు కేబినేట్ ‘తెలంగాణ లాజిస్టిక్ పాలసీ’కి ఆమోదం తెలిపింది. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 1400 ఎకరాల్లో డ్రై పోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ట్రక్ డాక్ పార్కింగ్ వసతులను మెరుగుపరుచనున్నారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగ అభివృద్ధిలో భాగంగా ఆయా ఉత్పత్తులను విదేశీ వినియోగదారులకు అందించేందుకు లాజిస్టిక్ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.