Jagan – KCR: తొలి, మలి దశ పోరాటాలు చేస్తే, ఎంతోమంది యువకులు తనువులను తృణప్రాయంగా బలిస్తే తెలంగాణ వచ్చింది. గిరి గిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. అటుకులే బుక్కుతున్నమో, అరిసెలే తింటున్నదో.. తెలంగాణ ఇప్పుడు తన బతుకు తాను బతుకుతున్నది. కానీ ఆడ లేక మద్దెల ఓడినట్టు మళ్లీ ” కలిసి ఉంటే కలదు సుఖము” అనే సూక్తి ముక్తావళి తెరపైకి వస్తున్నది.. నిన్న ఆంధ్ర ప్రదేశ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ కలుద్దామని పనికిమాలిన వ్యాఖ్యలు చేశాడు. తన పేరులోనే తెలంగాణ వాదాన్ని నింపుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. మొన్నటిదాకా మార్గదర్శి విషయంలో రంకెలు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు కొత్తగా కార్య క్షేత్రంలోకి దిగుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మార్చిన నిర్ణయానికి సమర్థన తెలుపుతూ ఎన్నికల కమిషన్ పంపిన లేఖలో హైదరాబాదును ఆంధ్రప్రదేశ్లో ప్రాంతంగా పేర్కొన్నది.. ఏపీ సీఈఓ కి పంపిన లేఖలో కూడా ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేకంగా మార్కు చేసింది. ఇవన్నీ చూస్తే వేటికవి భిన్నంగా అనిపించవచ్చు. కొందరు కాకతాళీయమని కొట్టిపారేయవచ్చు. కానీ మళ్లీ కాక రేపే ప్రయత్నం జరుగుతోందని ఎందుకు అనుకోకూడదు?!

-ఏమిటిది సజ్జల?
అదేమిటో గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యక్షమవుతూ ఉంటాడు.. సరే ఆయన సబ్జెక్టు, నాలెడ్జ్ పరిధి అనే విషయాలను పక్కన పెడితే… ప్రతిసారి ఆ చికెన్ నారాయణ లాగా మాట్లాడుతుంటాడు. విషయం ఒకటైతే… తాను ఒకటి చెబుతాడు. ఇప్పటికీ తనకు అతడు ప్లస్సో మైనసో తెలియని కన్ఫ్యూజన్లో జగన్ ఉన్నాడు. అదే కన్ఫ్యూజన్లో సజ్జల కూడా ఉన్నాడు . ఒకసారి రాష్ట్రం విడిపోయినాక మళ్ళీ కలపడం అనేది కుదరదు. కానీ ఆ సోయిలేని సజ్జల.. మళ్లీ కలుద్దాం అని ఆఫ్ బేక్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి దీనిని ఏ విధంగా సమర్థించుకుంటాడో ఆయనకే తెలియాలి. ఇక ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మార్పు నిర్ణయాన్ని సమర్థిస్తూ అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారులకు ఒక లేఖ పంపింది. కానీ ఈ లేఖలో హైదరాబాద్ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా చూపించింది. దీంతో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఎన్నికల సంఘం తన పని తాను చేయడం ఎప్పుడో మర్చిపోయిందని కొంతమంది వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.” ఓటు హక్కు కల్పించదు. లేఖ లో చిరునామా సరిగా ఉండదు. అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టని” కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సరే దీనిని పక్కన పెడితే వై ఎస్ హయాంలో “మార్గదర్శి” మీద రంకెలు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు ప్రగతి భవన్ కు అత్యంత ఆప్తుడు అయిపోయాడు. భారత రాష్ట్ర సమితిలో తాను ఒక కీలక సభ్యుడు కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.. తెర వెనుక మాత్రం భారీగానే కసరత్తు జరుగుతున్నది. ఉండవల్లి ప్రగతి భవన్ రావడం, ఫామ్ హౌస్ కు వెళ్లడం ఈమధ్య పరిపాటిగా మారింది. అని ఇదే సమయంలో మార్గదర్శిపై కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంప్లీడయ్యాడు.. కానీ కెసిఆర్ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ ఉద్యమంలో రామోజీ ఫిలిం సిటీని 1000 నాగళ్లతో దున్నుతా అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు సైలెంట్ కావడం నిజంగా ఆశ్చర్యకరమే.
-ఏం జరుగుతోంది?
తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయిపోయింది.. అంటే ఇప్పుడు కారు గుర్తు పై దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోటీ చేస్తారన్నమాట. అంటే దేశంలో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా భాగం కాబట్టి అక్కడ కూడా టిఆర్ఎస్ పోటీ చేస్తుందనే కదా అర్థం. కానీ ఇదే దశలో తన పుట్టుకకు కారణమైన తెలంగాణను బీఆర్ఎస్ వదులుకునేందుకు ఇష్టపడటం లేదు.. తన పార్టీ పేరులో తెలంగాణను తొలగించుకున్నంత మాత్రాన.. దూరం పెట్టేందుకు దానికి మనసు ఉప్పడం లేదు. అందుకే తెలంగాణ ప్రాంతంలో సెంటిమెంట్ రగిలించే యత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల షర్మిల నర్సంపేట పాదయాత్రను రచ్చ రచ్చ చేసింది. తెలంగాణ ప్రాంతాల్లో ఆంధ్ర నాయకులు రాజకీయాలు ఎలా చేస్తారని ప్రశ్నించింది.. మరి ఇదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో తమను ప్రశ్నించేందుకు వీలు లేకుండా భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది.అయితే ఈ పరిణామాల వెనుక కేసీఆర్ మంత్రాంగం ఉందని సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు.

*సడెన్ గా ఉమ్మడి ఏపీని చేయాలన్న వైసీపీ నినాదం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నాడన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకనాడు ఆంధ్రోళ్లను తరిమికొట్టిన ‘దొర’వారిని ఆంధ్రాలో కూడా జనం నమ్మాలంటే.. వారికి దగ్గర చేయాలంటే.. ‘ఉమ్మడి’ ఆంధ్రా అన్న నినాదమే పనిచేస్తుందని.. కేసీఆర్ ఈ స్కెచ్ గీస్తే.. ఆయన జిగ్రీ ఫ్రెండ్ జగన్ అమలు చేస్తున్నాడని.. జగన్ రైట్ హ్యాండ్ సజ్జల మాటల వెనుక మర్మం ఇదేనని అంటున్నారు. కేసీఆర్ వ్యూహంలో భాగంగానే ఉమ్మడి ఆంధ్రా అని లేవదీసి కేసీఆర్ ను దేశ్ కీ నేతగా ఫోకస్ చేసి ఆంధ్రా ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నం ఇదీ అని అంటున్నారు. విడిపోయాక సెంటిమెంట్లు ఉండవు. కానీ కలిసుంటే మాత్రం కేసీఆర్ కూడా ఉమ్మడి ‘ఆంధ్రా’ వాది అవుతాడు. అందుకే ఈ లాజిక్ ను బేస్ చేసుకొనే వైసీపీ వ్యూహాత్మకంగా ఏపీ+తెలంగాణ కలుపాలన్న నినాదం చేసినట్టు తెలుస్తోంది. దీని వెనుక కేసీఆర్ ఉన్నట్టుగా కనిపిస్తోంది.
ఏది ఏమైనప్పటికీ తెలంగాణ వాదం అనేది ఒక సజీవ శిలాక్షరం. దానిని ఎవరూ ఏమి చేయలేరు. సొంత ప్రయోజనాల కోసం వాడాలి అనుకుంటే భస్మీపటలం అవుతారు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. చరిత్ర కూడా ఇదే చెబుతోంది.