KCR- Visakha Steel Plant: చిన్న చాన్స్ దొరికితే చాలూ రాజకీయంగా అనువుగా మలుచుకోవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఓ చిన్న అవకాశముండడంతో ఆయన ఏపీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రాంతీయ వాదంతో టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో తమపై చేసిన కామెంట్స్ ను ఏపీ ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏపీ ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. దీంతో జాతీయవాదంతో వారి మనసు గెలుచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. తనపై వ్యతిరేకతను తగ్గించుకోవాలని చూస్తున్నారు. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గట్టిగా పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. విశాఖ స్టీల్ ను ప్రైవేటుపరం నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. ఇప్పుడు ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నారు. విశాఖ వేదికగా ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ విస్తరణకు ఇదో చాన్స్..
బీఆర్ఎస్ విస్తరణ తరువాత కేసీఆర్ ఏపీపై ఫోకస్ పెడతారని అంతా భావించారు. పెద్ద ఎత్తున నేతల చేరికలు ఉంటాయని భావించారు. ప్రధానంగా టీడీపీ నుంచి చేరికలకు ప్రోత్సహిస్తారని టాక్ నడిచింది. అటు అధికార వైసీపీ నేతలు సైతం టచ్ లో ఉన్నట్టు స్వయంగా కేసీఆరే ప్రకటించారు. దీంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేగింది. కానీ నెలలు గడుస్తున్నా అటువంటి చర్యలేవీ కనిపించలేదు. పైగా కేసీఆర్ కేవలం మహారాష్ట్రపైనే దృష్టిపెట్టారు. ఏపీ నుంచి ఒకరిద్దరు నాయకులు చేరారు. కానీ పార్టీ కార్యకలాపాలేవీ ప్రారంభం కాలేదు. ఇటువంటి సమయంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభిస్తే ఏపీ ప్రజలు ఆటోమేటిక్ గా తన వైపు టర్న్ అవుతారని కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ, వైసీపీలను సైతం డిఫెన్స్ లో పడేయవచ్చన్నది కేసీఆర్ ఆలోచన.
రేపు విశాఖకు తోట చంద్రశేఖర్..
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కేసీఆర్ లేఖ రాసిన మరుక్షణం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్వాగతించారు. ఇప్పటికే ఆయన విశాఖలో రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. తరచూ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు.ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ఉద్యమంతోనే బీఆర్ఎస్ ను ఏపీ రాజకీయాల్లో స్థిరపరచుకోవాలని భావిస్తున్నారు. కేసీఆర్ సభకు ఏపీ బీఆర్ఎస్ నేతలు శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ 8న విశాఖ రానున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమ కార్యాచరణ సమితి ప్రతినిధులతో సమావేశం కానున్నారు. వారితో పాటు కొందరు ప్రముఖులతో భేటీ కానున్నారు. ఆ నివేదికను హైకమాండ్ కు పంపనున్నారు. వారి అభిష్టం మేరకు అజెండాను రూపొందించి కేసీఆర్ సభలో కీలక ప్రకటన చేయనున్నారు.
నిశితంగా గమనిస్తున్న వైసీపీ, టీడీపీ
అయితే ఆది నుంచి కేసీఆర్ ఉత్తరాంధ్రపై ఫోకస్ పెంచినట్టు వార్తలు వచ్చాయి. ఆయన పూర్వీకులు ఉత్తరాంధ్ర కావడంతో సామాజికవర్గ అండతో పార్టీని విస్తరించనున్నట్టు ప్రచారం సాగింది. కానీ అవేవీ కార్యాచరణలో కనిపించలేదు. ఇప్పుడు స్టీల్ ఉద్యమంతో కేసీఆర్ విశాఖలో అడుగు పెడుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఏపీలో భిన్న రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ బీజేపీ ప్రాపకం కోసం చూస్తున్నాయి. ఇటువంటి సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పావులు కదుపుతుండడంతో ఆ రెండు పక్షాలు ఎలా స్పందిస్తాయో అన్నది ప్రాధాన్యతాంశంగా మారింది. అందుకే అవి కేసీఆర్ చర్యలపై నిశితంగా గమనిస్తున్నాయి. ఎటువంటి కామెంట్స్ కూడా చేయడం లేదు. మొత్తానికైతే కేసీఆర్ స్టీల్ ఉద్యమంతో ఏపీలో గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Kcr grand entry in ap with visakha steel movement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com