Governor Tamilisai- KCR: లక్ష్యం ఎదురుగా ఉన్నా మన గురి సరిగ్గా ఉండాలని లేదు. వింటినారి బలంగా ఉన్నా, చూపు చురకత్తిని పోలినా, బాణం పదునుగా ఉన్నా ఒక్కోసారి మనకు దిశా నిర్దేశం చేసే మాట సాయం కావాల్సి రావొచ్చు. అప్పుడే కదా మన గురి, ఎదుటి వారి మాట రెండూ కలిసి లక్ష్యాన్ని సాధించేది.
దూరం పెరిగింది
స్నేహాలు ఎప్పుడూ వర్ధిల్లాలని లేదు. పుష్పగుచ్చం ఇచ్చిన చేయి ఎప్పుడూ చెయ్యి ఇవ్వకూడదనే రూలు లేదు. నిండు అసెంబ్లీ లో ప్రభుత్వ సోత్కర్ష కే పరిమితయ్యే ప్రసంగం ఎప్పుడో ఒకప్పుడు ఎదురు తిరగకూడదనే నిబంధన ఏమీ లేదు. ప్రగతి భవన్ కు రాజభవన్ కు ఒకప్పుడు దూరం ఉండేది కాదు. రోజులు అన్ని ఒకేలా ఉండవు కదా! ఓడలు బండ్లు అయ్యాయి. ఇప్పుడు టరమ్స్ దెబ్బ కొట్టాయి. అవి ఇప్పట్లో బాగయ్యే సూచనలు కూడా కనిపించట్లేదు.
Also Read: Congress Ready Early Elections: ముందస్తుకు కాంగ్రెస్ సమాయత్తం.. అభ్యర్థుల జాబితా రెడీ!!
వెటర్నరీ వైద్యురాలి అత్యాచార ఘటనతో
నరసింహన్ అనంతరం తమిళిసై సౌందరరాజన్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ప్రగతి భవన్ తో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. కెసిఆర్ సతీమణి శోభ నుంచి నమస్తే తెలంగాణ దాకా ప్రతిదాంట్లో తమిళ ఆడపడుచు అగ్రతాంబూలం దక్కేది. ఇలా జరుగుతున్న ఈ ఎపిసోడ్లో వెటర్నరీ వైద్యురాలి అత్యాచార ఘటన కుదుపు కుదిపింది. ఈ అత్యాచారం పై రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగోలేవని, ఇక్కడ ఆడ పిల్లలకు సరైన రక్షణ లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. సరిగ్గా ఇదే టైంలో బాధితురాలి కుటుంబాన్ని తమిళ సై సౌందరరాజన్ పరామర్శించారు. వెటర్నరీ వైద్యురాలి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఈ కేసు పూర్వపరాలు నాకు చెప్పాలని అప్పటి డిజిపిని కోరారు. ఈ పరిణామం కేసీఆర్కు చిరాకు, కోపం తెప్పించాయి. తను మాట్లాడుతున్నప్పుడు ఎదురు మాట్లాడితేనే తట్టుకోలేని కేసీఆర్కు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు మింగుడుపడలేదు. గవర్నర్ ఎప్పుడైతే ఈ కేసులో కి దిగారో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అది చినికి చినికి సీఎం రీకన్స్ట్రక్షన్ చేసే వరకు వెళ్ళింది. ఆ తర్వాత నిందితుల ఎన్ కౌంటర్, హ్యూమన్ రైట్స్ రంగప్రవేశం ఇలా ప్రభుత్వం ఒక ఐదు నెలల పాటు ఈ కేసు చుట్టూ పరిభ్రమించాల్సి వచ్చింది.
పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో
హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు కెసిఆర్ ఎక్కుపెట్టిన అస్త్రం పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్లో ఉన్న కేసీఆర్కు నమ్మినబంటుగా ఉండటంతో అతనికి ఎమ్మెల్సీ ఇవ్వాలని భావించారు. ఇందులో భాగంగానే ఆ ఫైలును గవర్నర్ దగ్గరికి సామాజిక సేవ విభాగంలో కేటాయించాలని పంపారు. క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అనంతరం గవర్నర్ ఆ ఫైలును కొద్దిరోజులు పెండింగ్లో పెట్టారు. అప్పుడే హుజురాబాద్ ఎన్నికలు ఉండటంతో ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఇక అప్పటినుంచి రాజ్ భవన్, ప్రగతి భవన్ పరస్పరం కత్తులు దూసుకు న్నాయి. ఇక అప్పటి నుంచి రాజ్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకలు, మహిళా దినోత్సవం ఇలా ఏ సందర్భంలోనూ ప్రభుత్వ పెద్దలను పిలిచినా గైర్హాజరయ్యారు. గవర్నర్ తల్లి కన్నుమూసినా, ప్రత్యేక ఫ్లైట్ కేటాయించాలని తమిళ సై సౌందరరాజన్ విన్నవించినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. తల్లి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమిళిసై సౌందరరాజన్ ను సీఎం కేసీఆర్ కనీసం పరామర్శించ లేదు. ఇంత జరిగినా ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగాన్ని గవర్నర్ లేకుండానే పూర్తిచేసింది. ఈ గొడవ ఇంతటితోనే చల్లారలేదు. మేడారం జాతర మొదలుకొని మొన్నటి కొత్తగూడెం పర్యటన దాకా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదు. పైగా కీలక అధికారులను అప్పటికప్పుడు సెలవులో పంపింది.
సురేంద్రమోహన్ దర్శకత్వంలో..
ఇన్ని పరిణామాల మధ్య గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా ప్రజా క్షేత్రంలో నిలబెట్టాలని పలు కీలక పర్యటనలకు తెరలేపారు. మహబూబ్నగర్లో చెంచుగూడేల సందర్శన, కొత్తగూడెంలో ఆదివాసీలకు చేయూత, యూనివర్సిటీలో వీసీ నియామకంపై ఆరా ఇలా తనకు కలసి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా ప్రజాక్షేత్రంలో నిలబెడుతున్నారు. ఇందుకు ఆమెకు వ్యక్తిగత సలహాదారు ఐఏఎస్ సురేంద్రమోహన్ సహకరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
సురేంద్రమోహన్ అలా దగ్గరయ్యారు
నల్లగొండ జిల్లాకు చెందిన సురేంద్రమోహన్ ఐఏఎస్ అధికారి. ఖమ్మం గుంటూరు జిల్లాలో జెసి గా పనిచేశారు. అక్కడ తన మార్కు పాలన ప్రదర్శించారు. ఈలోగా తెలంగాణ ఏర్పడటం, కొత్త జిల్లాలు కూడా తెరపైకి రావడంతో సూర్యాపేట జిల్లాకు ఆయన కలెక్టర్గా నియమితులయ్యారు. అప్పట్లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయం సూర్యాపేటలో వివాదాస్పదమైంది. అక్కడ నిర్మించాలని మంత్రి జగదీష్ రెడ్డి, వద్దని సురేంద్రమోహన్.. ఇలా ఇద్దరు మధ్య తగాదా లో జగదీష్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆ తర్వాత ఈగో హర్ట్ అయ్యి సురేంద్ర మోహన్ జాతీయ సర్వీసులో కి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన పనితీరు తెలుసుకున్న తమిళ సై సౌందరరాజన్.. తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యాకా మారు మాటకి అవకాశం లేకుండా సురేంద్రమోహన్ ను తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు.
కొద్ది రోజులు రాష్ట్ర పరిస్థితులు అవపోసన పట్టే దాకా గవర్నర్ నిశ్శబ్దంగానే ఉన్నారు. తర్వాత జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించారు. అందులో భాగంగానే సురేంద్రమోహన్ సలహాలు సూచనలు తీసుకున్నారు. ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా సురేంద్రమోహన్ డైరెక్షన్ లో జరుగుతున్నవే. ఈ పరిణామాలపై మెజారిటీ ప్రజలు మాత్రం గవర్నర్ వైపు ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఆదివాసీలకు రెడ్ క్రాస్ సేవలు దగ్గర చేయడం లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేస్తున్న కృషి అమోఘం. రక్తహీనతతో బాధపడుతున్నారా గర్భిణులకు, చిన్నారులకు, యుక్త వయసు పిల్లలకు తమిళిసై సౌందరరాజన్ పంపిణీ చేసిన పోషకాహార కిట్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇదంతా జరుగుతుండగానే ఇటీవల ఆమె ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రధానమంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించారు. ఆ సమయంలో తాను ఎవరికీ భయపడని, తన వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని కెసిఆర్ కు గట్టి సంకేతాలు పంపారు.
Also Read:Rewanth Reddy- Sharmila: షర్మిలను కలుపుకుంటున్న రేవంత్ రెడ్డి