రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. వైరస్ బారిన పడుతున్నవారు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. అయితే వైరస్ సోకినివారికి తెలంగాణలో సరియైన ట్రీట్మెంట్ ఇవ్వడం లేదనే టాక్ వినపడుతోంది. వారికి కనీస అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వాలు దేశంలో అనేకం ఉన్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో ఉందనేది బహిరంగ రహస్యం. ఇదిలా ఉంటే మరోవైపు కోలుకుంటున్నవారి సంఖ్య(రికవరీ) కూడా పెరుగుతొందని ప్రభుత్వ వర్గాలు లెక్కలేస్తున్నాయి. కనీసం ట్రీట్ మెంట్ కి కావలిసిన వైద్య సౌకర్యాలు అందించకుండానే అంతమంది ఎలా రికవరీ అవుతున్నారనేది..? ఒక సామాన్యుడి ప్రశ్న.
Also Read : ఇద్దరు మిత్రులే కానీ.. నీళ్ల వద్దే పంచాయితీ..!
ఇదే విషయంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్నాయి. ఓ మీడియా సంస్థతో గవర్నర్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదని అన్నారు. కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేక పోయిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా తీవ్రత వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సూచనలు చేస్తూ…ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్ తమిళిసై తెలిపారు. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది.
కరోనా నియంత్రణలో కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా తెలంగాణ సర్కారును దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందన రాకపోవడం సహజంగానే ఆసక్తిని రేకెత్తించే అంశం. ఈ ఎపిసోడ్ పట్ల వివిధ వర్గాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. మొదటిది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహజ శైలి అయిన స్పందించకుండా ఊరుకోవడం. స్పందిస్తే ఈ విషయం ప్రాధాన్యం పొంది చర్చ లోతుల్లోకి వెళ్లి సహజంగానే తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది.
Also Read : చివరికి బాబు మెడకు చుట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు !
రెండో అంశం కేంద్రం దృష్టిలో తన పని తీరు పడాలనే ఉద్దేశంతో గవర్నర్ ఈ రీతిలో స్పందించారని టీఆర్ఎస్ వర్గాలు అనుమానపడుతున్నాయట. తెలంగాణ బీజేపీ నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో గవర్నర్ ఇలా అసంతృప్తి వ్యక్తం చేయడం సహజంగానే వారికి మేలు చేసే అంశం. ఈ నేపథ్యంలో గవర్నర్ మాటలపై స్పందిస్తే కరోనా కలకలం మరిన్ని మలుపులు తిరగడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయని టాక్.
మరోవైపు ఈ ఎపిసోడ్లోకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎంట్రీ ఇచ్చారని అంటున్నారు. గవర్నర్ తీరును తప్పుపడుతూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసిన ట్వీట్ తొలగించడం వెనుక కారణం కేటీఆర్ అని చెప్తున్నారు. మనపని మనం చేసుకుంటూ పోవాలే తప్పించి స్పందించకూడదని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడు గవర్నర్ కామెంట్లపై స్పందిస్తే కేంద్ర ప్రభుత్వం ఐసీఎంఆర్ సహా వివిధ సంస్థలు ఎంట్రీ ఇచ్చి కరోనాపై తెలంగాణ సర్కారు పనితనాన్ని విశ్లేషిస్తాయనే ఉద్దేశంతో సైలెంట్ అయిపోవాలని గులాబీ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : వైసీపీ నేతలపై జనసేన ఎమ్మెల్యే పెత్తనమెంటో?