KCR Politics: సీఎం కేసీఆర్ ఉగ్గబట్టుకోవడం లేదు. తన ఫస్ట్రేషన్ అంతా మీడియా ముందర కక్కేస్తున్నారు. జనాలకు తన బాధ కోపం ఆవేశం అంతా తెలిసేలా బయటపడుతున్నాడు. కేసీఆర్ లో ఇప్పుడు ఫస్ట్రేషన్ పెరిగిపోవడానికి కారణం హుజూరాబాద్ ఉపఎన్నిక.. తను ఎదురించి బయటకెళ్లిన ఈటల రాజేందర్ ఘనంగా గెలవడం.. చివరకు తాను అసెంబ్లీలో అడుగుపెట్టనీయనని శపథం చేస్తే ఈరోజు ఏకంగా ప్రమాణ స్వీకారం చేయడం.. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ చర్యలతో హీటు పెరుగుతూనే ఉంది. మొన్నటి దాకా జరిగిన హుజురాబాద్ ఉపపోరు హడావుడి ముగిసింది. ఫలితాలు తమ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కేసీఆర్. తెలంగాణలో తిరుగులేదు అనుకున్న గులాబీబాస్ హుజురాబాద్‌పై విజయ బావుట ఎగురువేస్తామనుకున్నారు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా కమలం పువ్వు గుర్తుపై పోటీ చేసిన ఈటల గెలిచారు. కేసీఆర్ వర్సెస్ ఈటెలగా సాగిన బైపోరులో ఓటర్లు ఈటెల వైపు నిలబడ్డారు. అధికారంతో పాటు పార్టీ ప్రలోభాలు, ప్రయత్నాలు ఎన్ని చేసిన ఓటర్ల మైండ్ సెట్ పసిగట్టడంలో గులాబీ పార్టీ నేతలు విఫలమయ్యారనే చెప్పాలి.
ఒక్క ఈటల విజయం తెలంగాణ రాజకీయాలతో పాటు సీఎం కేసీఆర్‌లో అనేక మార్పులు వస్తాయన్న రాజకీయ విశ్లేషకుల మాటలు కేసీఆర్ వరుస మీడియా సమావేశాలతో నిజం అని స్పష్టమవుతున్నాయి. ఈ క్రమంలో ఓటమిపై ప్రతిపక్షాలు మాటలకు తాను సమాధానం చెప్పకుండా, తాను వేసిన ప్రశ్నలకు ప్రతిపక్షాలు మాట్లాడాలని కౌంటర్‌గా ప్రెస్ మిటింగ్‌లు కేసీఆర్ నిర్వహిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ, బీజేపీ మాత్రం హుజురాబాద్ ఓటమి ఫ్రస్టెషన్‌లో కేసీఆర్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేస్తోంది. ఎప్పుడూ సరిగ్గా మీడియా ముందుకు రానీ కేసీఆర్ ఒక్కసారిగా అది కూడా వరుసగా మీడీయా సమావేశాలు నిర్వహించడం సర్వత్రా చర్చనీయంశం అవుతోంది.
కేంద్రంతో దోస్తీ.. రాష్ట్రంలో కుస్తీగా సాగుతున్న బీజేపీ-టీఆర్ఎస్ సంబంధం పై కేసీఆర్ మాటల తీరుతో ప్రజలు ఆలోచనలో పడ్డారు. పండించిన ధాన్యాన్ని అంతా కొనుగోలు చేయాలని కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు సీఎం కేసీఆర్. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయమంటుందని, వరి పంట వేస్తే ఉరే అంటూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ-కాంగ్రెస్‌లు క్షేత్ర స్థాయిలో ప్రతి రైతుకు చేరువయ్యేలా ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని భావించిన కేసీఆర్ స్వయంగా తానే రంగంలోకి దిగారు.
హుజురాబాద్ ఓటమి నుంచి ప్రజలను డైవర్షన్ చేయడానికి, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి, ప్రజలకు నిజమేదో అబద్దమోదో చెప్పడానికి తానే ముందుకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు సీఎం కేసీఆర్. ఈ మీడియా సమావేశాల్లో ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన కేసీఆర్.. బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విమర్శల బాణాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ధ్వజమెత్తారు కేసీఆర్. వరి ధాన్యాన్ని ఖచ్చితంగా కేంద్ర కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12 వ తేది నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించారు కూడా.
దేశంలో అగ్గిపెడుతామనంటున్న కేసీఆర్ మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపడుతుందనే ఉద్ధేశ్యంతోనే బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపు కేసీఆర్-బీజేపీ పంచాయతీతో రైతులను పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంతో పని లేకుండా ప్రతి గింజా కొంటానని గతంలో కేసీఆర్ చెప్పిన మాటకు కట్టుబడి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తోంది. అలాగే, కాంగ్రెస్ బలపడకుండా బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలాడుతుందని విమర్శిస్తోంది. మొత్తానికి కేసీఆర్ డైవర్షన్ రాజకీయాలను తెరపైకి తీసుకువచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మున్ముందు కేసీఆర్, బీజేపీ ల మధ్య ఎలాంటి మాటల యుద్ధం నడుస్తుందో చూడాలి
Also Read: కేసీఆర్ పై మరో బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి