హుజురాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ దృష్టి సారించింది. తెలంగాణ మరో బెంగాల్ అవుతుందని భావిస్తున్న సీఎం కేసీఆర్ బీజేపీకి చాన్సివ్వకూడదనే సాకుతో ముందుకు కదులుతున్నారు. ఈటల రాజేందర్ సొంత పార్టీ పెడతారని ఆలోచించినా వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఆయన బీజేపీలో చేరడంతో ఆ పార్టీ బలం పెరిగిందని సర్వేలు సూచిస్తున్నాయి.
ఈ తరుణంలో హుజురాబాద్ లో ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ హుజురాబాద్ లో ఖాతా తెరిచి 2023 ఎన్నికలకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. బెంగాల్ తరహా పోరాటం చేస్తామని బీజేపీ చెబుతుండడంతో టీఆర్ఎస్ లో భయం పుట్టుకొస్తోంది.
తమ తరువాత టార్గెట్ తెలంగాణ అని బీజేపీ నాయకులు ప్రకటించడంతో సీఎం కేసీఆర్ వారి అంచనాలు తలకిందులు చేయాలని ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. నాగార్జున సాగర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటడంతో బీజేపీలో నిరాశ పెరిగింది. మళ్లీ దూకుడు పెంచడానికి హుజురాబాద్ ను ఉపయోగించుకోన్నట్లు తెలుస్తోంది.
దుబ్బాకలో గెలిచిన తరువాత బీజేపీ దూకుడుతో టీఆర్ఎస్ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు హుజురాబాద్ లో గెలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయోనని టీఆర్ఎస్ భయపడుతోంది. అందుకే కేసీఆర్ హుజురాబాద్ లో ఎలాగైనా విజయం సాధించాలనే ధీమాతో సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కూడా అంతే స్థాయిలో విజయం కోసం సర్వ శక్తులు ఒడ్తుతోంది.