KCR: హుజురాబాద్ ఉప ఎన్నిక రసకందాయంలో పడింది. పార్టీల ప్రచారం జోరు పెరిగింది. దీంతో ఎన్నికల సంఘం నిబంధనలు కఠినతరం చేసింది. పక్క జిల్లాల్లో కూడా సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించడంతో పార్టీలు ఖంగుతిన్నాయి. టీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినా ఎన్నికల సంఘం నిబంధనలతో వెనకడుగు వేస్తోంది.

ఈ నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహణ సాధ్యం కాదని తెలియడంతో కేసీఆర్ తో రోడ్ షోలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 26 లేదా 27న జరిపేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. మంత్రుల నుంచి వచ్చన సూచన మేరకు రోడ్ షో నిర్వహించాలని ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. దీనికి కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
హుజురాబాద్ లో గెలుపు కోసం రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. సానుభూతి ఓట్లతో విజయం సాధించాలని ఈటల రాజేందర్ భావిస్తుండగా అభివృద్ధి మంత్రంతోనే ఓట్లు రాబట్టుకోవాలని టీఆర్ఎస్ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారం కోసం నేతలను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని యోచిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి. పరువు పోకూడదనే ఉద్దేశంతో శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డాయి. మరి కొద్ది రోజుల్లో ఫలితం తేలనున్న నేపథ్యంలో పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల మనోగతంపై అప్పుడే అంచనాలు వేసుకుంటున్నాయి.