KCR: కేంద్రప్రభుత్వం తీరుపై మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. కేంద్రం తీరును కడిగిపారేశారు. పంజాబ్ లో మొత్తం వరిధాన్యం కొంటున్నారని.. కానీ మన రాష్ట్రంలో కొనుగోలు చేయడం లేదని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం, రాష్ట్రానికి, ప్రాంతానికి ఒక నీతి పాటిస్తోందని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని మరోసారి స్పష్టం చేశారు.

కేంద్రప్రభుత్వం ఏ రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని కేసీఆర్ నిలదీశారు. కేంద్రమంత్రిని కలిసి 50 రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎఫ్.సీ.ఐ కొనుగోలు చేస్తామంటే కూడా కేంద్రం నిరాకరిస్తోందన్నారు.
ఏడాదికి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని కేంద్ర ఆహారశాఖ మంత్రిని అడిగితే చెప్పడం లేదని.. జీఓఎంలో చర్చించి చెబుతామని దాటవేశారని కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇక్కడ బీజేపీ నాయకులు ఏమో యాసంగిలో వరి వేయాలని చెబుతూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో పంట మార్పిడి చేయాలని రైతులకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
కేంద్రం తెలంగాణ రైతుల ధాన్యం కొంటుందా? కొనదా చెప్పాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 18న ఇందిరాపార్క్ లో మహాధర్నాకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు అంతా ఈ ధర్నాలో పాల్గొనాలని ఆదేశించారు. కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సహా అన్ని వేదికలపై కొట్లాడుతాం.. 100 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ధర్నా చేసిన తర్వాత కూడా కేంద్రం స్పందించకపోతే ప్రజలే నిర్ణయిస్తారు. బీజేపీ చేసిన నల్లచట్టాలపై పోరాడుతామని.. విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామని.. బీజేపీ నేతలను వరి కొనుగోలు పై కేంద్రం ప్రకటించే వరకూ నిలదీస్తామని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.