KCR – BSP : ఇంతలో ఎంత మార్పు. 2019లో మేం పోటీ చేస్తామంటే, మేము పోటీ చేస్తామంటూ తెలంగాణ భవన్ చుట్టూ చాలామంది ప్రదక్షిణలు చేశారు. 2023 ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. అప్పట్లో చాలా మందికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేక పార్లమెంట్ ఎన్నికలప్పుడు చూద్దామని కెసిఆర్ హామీ ఇచ్చారు. కానీ ఏం జరిగింది? ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. భారత రాష్ట్ర సమితి బయటపడటం లేదు గాని.. పోటీ చేసేందుకు కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు కూడా లేరట. ఉన్న వాళ్ళని పోటీ చేయమంటే మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారట.. అందువల్లే బహుజన్ సమాజ్ వాది పార్టీతో పొత్తు పెట్టుకున్నారట. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ సీటు మాత్రమే అడిగితే.. బంపర్ ఆఫర్ గా మరొక సీట్ కేసీఆర్ ఇచ్చారట.
నాగర్ కర్నూల్ నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండగా.. ఆదిలాబాద్ స్థానాన్ని కూడా భారత రాష్ట్ర సమితి ఏనుగు పార్టీకి కేటాయించింది. ఈ విషయం తెలియడంతో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గోడం నగేష్ బీజేపీలో చేరారు. నగేష్ బీజేపీలో చేరడంతో అక్కడ పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో.. అనివార్యంగా భారత రాష్ట్ర సమితి బిఎస్పీకి ఆదిలాబాద్ సీటు ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అందులో హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి భారత రాష్ట్ర సమితి ఎన్నడూ గట్టి అభ్యర్థిని నిలపలేదు. ఇప్పుడు కూడా నిలిపే అవకాశం లేనట్టు తెలుస్తోంది. అలాంటప్పుడు 16 స్థానాలకు రెండు స్థానాలు బిఎస్పీకి కేటాయిస్తే.. మిగతా 14 స్థానాల్లో భారత రాష్ట్ర సమితి పోటీ చేయాల్సి ఉంటుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలు కమ్యూనిస్టులు అడిగితే కేసీఆర్ ఇవ్వలేదు. పైగా వారిని అవమానపరిచి బయటికి వెళ్లగొట్టారు. మునుగోడు ఉప ఎన్నిక వారి వల్ల గెలిచిన విషయం తెలిసినప్పటికీ.. కెసిఆర్ వారిని పట్టించుకోలేదు. అయితే రేవంత్ రెడ్డి అత్యంత తెలివిగా కమ్యూనిస్టులకు ఒక్క సీటు ఇచ్చి పొత్తు కుదుర్చుకున్నారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కెసిఆర్ కు తత్వం బోధపడింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఖచ్చితంగా పొత్తు కావాల్సి వచ్చింది. ఫలితంగా బీఎస్పీతో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం బీఎస్పీకి దళితుల్లో ఆదరణ అంతంత మాత్రమే ఉంది. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోవడమే అందుకు నిదర్శనం. ఇక ఓట్ల పరంగా చూసుకుంటే గత ఎన్నికల్లో మూడున్నర లక్షలకు మించలేదు. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితి రెండు సీట్లు ఇచ్చేసింది. సిట్టింగ్ స్థానమైన నాగర్ కర్నూల్, గతంలో విజయం సాధించిన ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ బీఎస్పీకి ఇచ్చేసింది.. అయితే ఈ రెండు స్థానాల్లో ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఒకరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. మరొకరు అంతగా రాజకీయాల్లో బలవంతులు కాదు. అలాంటప్పుడు వీరి కోసం కేసీఆర్ ఎందుకు త్యాగాలు చేశారనేది అర్థం కాని ప్రశ్న.