అరవీర భయంకరంగా ఉన్న మోడీని పడగొట్టే నేత ఎవరు? ఎవరు? అని ప్రతిపక్షాలన్నీ శూలశోధన మొదలు పెట్టాయి. రాహుల్ గాంధీ అసలు మోడీకి ఏమాత్రం సరితూగరని తేలింది. బెంగాల్ సీఎం మమతకు ఆవేశం మైనస్ గా మారింది. మరాఠా యోధుడు శరద్ పవార్ కు వయసు అయిపోయింది. వృద్ధాప్యం వెంటాడుతోంది. మరీ మోడీకి పాలనలో, రాజకీయంలో సరితూగే వారు ఎవరు అని శోధిస్తే ‘కేసీఆర్’ పేరు ప్రస్తావనకు వచ్చిందట.. శరద్ పవార్ సూచన మేరకు జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ను తీసుకురావాలని ప్రముఖరాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డిసైడ్ అయినట్లు జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతోంది.
దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను గద్దెనెక్కిస్తూ దేశంలోనే పాపులర్ స్ట్రాటజిస్ట్ గా పేరొందారు. ఇప్పటికే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, ఏపీలో సీఎం జగన్, బెంగాల్ లో మమతా బెనర్జీని, తమిళనాడులో డీఎంకే స్టాలిన్ ను గెలిపించి తన సత్తా చాటుకున్నాడు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పిఎసి) వ్యవస్థాపకుడిగా ప్రశాంత్ కిషోర్ దేశంలోని పలు ప్రధాన రాజకీయ పార్టీల కోసం పనిచేశారు. ఆయన అన్ని చోట్ల ఎన్నికలలో విజయం సాధించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ (పీకే) ఎక్కువగా పనిచేస్తుంటారు.
2014లో భారతీయ జనతా పార్టీ కోసం పనిచేశాడు. చాయ్ పే చార్చా వంటి వినూత్న ప్రచారంతో నరేంద్ర మోడీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాడు.తరువాత బీహార్‌లోని జనతాదళ్ (యు) నాయకుడు నితీష్ కుమార్ ను పంజాబ్‌లో కాంగ్రెస్ నాయకుడు అమరీందర్ సింగ్ కోసం పనిచేసి వారిని అధికారంలోకి తీసుకువచ్చారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం పనిచేసి అత్యధిక మెజార్టీని ఆంధ్రప్రదేశ్ లో తెచ్చిపెట్టారు. రాజకీయ గతిశీలతను ఎలా మార్చారో పీకేకు బాగా తెలుసు. “బై-బై బాబు” ప్రచారం 2019 లో అసెంబ్లీ ఎన్నికలలో భారీ ఊపునిచ్చింది. ఈ గెలుపు తెలివిగల ఎన్ చంద్రబాబు నాయుడు పార్టీని చిత్తు చేసింది. 37 ఏళ్ల తెలుగు దేశం పార్టీని నాశనం చేసింది.
ఇటీవలి ఎన్నికలు జరిగిన వెంటనే, దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయనని ప్రశాంత్ ప్రకటించారు. అయితే, అతని బృందం 2026 వరకు మమతా బెనర్జీ కోసం పని చేస్తుంది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి కోసం ఇంకా పనిచేస్తోంది.
అయితే ప్రశాంత్ పనిలేకుండా కూర్చోవడం లేదని వార్తలు వస్తున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌తో ఆయన ఇటీవల జరిగిన సమావేశమయ్యారు. అతను ఖచ్చితంగా ఏదో ఒక పనిలో ఉన్నారనే ఊహాగానాలకు దారితీసింది. 2024 నాటికి బిజెపికి శక్తివంతమైన ప్రత్యామ్నాయాన్ని తేవడానికి బిజెపియేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఒక చర్చ జరిగింది.
అదే సమయంలో, శరద్ పవార్‌ను ప్రతిపక్ష పార్టీల అధ్యక్ష అభ్యర్థిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజా నివేదికల ప్రకారం ప్రశాంత్ కిషోర్ దృష్టి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పై పడినట్టు తెలిసింది. కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లో ఫోకస్ చేయాలని పీకే డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయడానికి పీకే సంసిద్ధతను వ్యక్తం చేశారని తెలిసింది. కేటీఆర్ ను ఇక్కడ సీఎం ను చేసి జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ను ఫోకస్ చేయాలని పీకే డిసైడ్ అయినట్లుగా సమాచారం. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె టిఆర్ తో ఈ మేరకు పీకే చర్చలు జరిపినట్లు సమాచారం.
టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొదట్లో రాజకీయ వ్యూహకర్తతో పనిచేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే కేసీఆర్ యే సమకాలీన రాజకీయాల్లో పాపులర్ వ్యూహకర్త. కానీ కెటిఆర్ , కవిత రాష్ట్రంలో బిజెపి వృద్ధిని తగ్గించడానికి ప్రశాంత్ కిషోర్ ను తీసుకోవాలని.. కేసీఆర్ ను ఒప్పించారని తెలిసింది. రాబోయే రోజుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాడన్నది వేచిచూడాలి.