BJP: కెసిఆర్, చంద్రబాబులే బిజెపి టార్గెట్

బిజెపి తాజా నినాదంతో కెసిఆర్ కు చాలా నష్టం కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన బీసీ నేతలు ప్రస్తుతం బిఆర్ఎస్ లో ఉన్నారు.

Written By: Dharma, Updated On : November 14, 2023 1:03 pm

BJP

Follow us on

BJP: బిజెపి బీసీ నినాదం ఎవరికి నష్టం? ఎవరి ఓటు బ్యాంకుకు గండి పడనుంది? అది తెలంగాణకే పరిమితమా? ఆంధ్రకు కూడా విస్తరిస్తుందా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. అధికార బిఆర్ఎస్ దూకుడుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. బిజెపి మాత్రం ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకుంది.బీసీ నినాదంతో పాటు మాదిగ సామాజిక వర్గ ఓటు బ్యాంకుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇది కచ్చితంగా అధికార బి ఆర్ ఎస్ కు కలవరపాటుకు గురి చేసే అంశమే.

అయితే బిజెపి తాజా నినాదంతో కెసిఆర్ కు చాలా నష్టం కలుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన బీసీ నేతలు ప్రస్తుతం బిఆర్ఎస్ లో ఉన్నారు. టిడిపి బీసీ కేడర్ సైతం కెసిఆర్ కు జై కొట్టింది. ఇప్పుడు అదే బీసీ నినాదాన్ని బిజెపి బయటకు తేవడం సహజంగానే కెసిఆర్ కు నష్టం కలిగిస్తుంది. అటు మాదిగ సామాజిక వర్గం సైతం గత రెండు ఎన్నికల్లో మద్దతు తెలిపింది. అందుకే కెసిఆర్ సైతం దళిత బందును ప్రవేశపెట్టారు. మాదిగలపై ప్రత్యేక అభిమానాన్ని కనబరిచేవారు. ఇప్పుడు అదే మాదిగలను మచ్చిక చేసే పనిలో బిజెపి పడడం విశేషం.

అయితే ఒక్క తెలంగాణయే కాదు. ఏపీ బీసీఎంలో సైతం ముందుచూపుతో వ్యవహరించి బీసీ నినాదంతో పాటు మాదిగలను బిజెపి దగ్గర చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఒకవేళ తెలంగాణలో బీసీలతో పాటు మాదిగలు బిజెపి గూటికి చేరితే మాత్రం.. ఏపీలో ప్రధమ నష్టం తెలుగుదేశం పార్టీకే. ప్రస్తుతం టిడిపి మద్దతు దారులుగా బీసీలతో పాటు మాదిగలు ఉన్నారు. గత ఎన్నికల్లో బీసీలు జగన్ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం జగన్ సైతం బీసీ నినాదంతో ముందుకు సాగుతున్నారు.ఇటువంటి సమయంలో బిజెపి మాదిగల తో పాటు బీసీల్లో చీలిక తెస్తే.. టిడిపి ఓటు బ్యాంకు కి గండి పడేది. ఇప్పటికే సంక్షేమ పథకాలతో బీసీల్లో బలమైన వర్గాల వారిని జగన్ ఆకట్టుకోగలిగారు. ప్రభుత్వ వ్యతిరేక వర్గాలుగా ఉన్న మిగతావారు.. బిజెపి పిలుపుతో చీలిపోతే అంతిమంగా నష్టం జరిగేది చంద్రబాబుకే. అంటే బిజెపి ఒక దెబ్బకు రెండు పిట్టలన్నమాట. తెలంగాణలో కెసిఆర్, ఏపీలో చంద్రబాబును దెబ్బతీసేందుకే బిజెపి ఈ నయా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆది నుంచి టిడిపి విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. మొన్నటికి మొన్న చంద్రబాబు అరెస్ట్ సమయంలో సైతం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు అటువంటి కృష్ణ మాదిగను ప్రధాని మోడీ స్వయంగా పిలిపించుకోవడం.. మాదిగల సభకు హాజరు కావడం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిగల తో పాటు బీసీ నినాదంతో ముందుకెళితేనే బిజెపికి భవిష్యత్తు ఉంటుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పావులు కలిపి ఆ రెండు వర్గాల్లో చొచ్చుకెళ్లాలని బలమైన ప్రయత్నంలో ఉంది. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాలు.. తదనంతర పరిణామాలతో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది.