తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ఓ ఇంటి ఆమె కాబోతోంది. తాజాగా ఆమెకు నిశ్చితార్థం అయ్యింది. పినతల్లి చేతుల్లో తీవ్ర వేధింపులకు గురైన ప్రత్యూషను కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ప్రత్యూషను సంరక్షణ బాధ్యతను ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యూష యోగక్షేమాలను చూస్తోంది. అయితే ప్రత్యూష తాజాగా నిశ్చితార్థం చేసుకుంది. హైదరాబాద్ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో నిరాడంబరంగా రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్‌రెడ్డితో ఆమె నిశ్చితార్థం జరిగింది. మమత, మర్‌రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.
Also Read: తెలంగాణకు రూ.10 కోట్ల విరాళం
2015 జూలైలో హైదరాబాద్‌లో సవతి తల్లితోపాటు కన్నతండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురైంది ప్రత్యూష. ఈ విషయంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ప్రసారం అయ్యాయి. వారి చేతుల్లో తీవ్ర గాయాలపాలైన ప్రత్యూషను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రత్యూష గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చలించిపోయాడు. ప్రత్యూషను పరామర్శించి తానున్నానంటూ అభయం ఇచ్చారు. వెంటనే ప్రత్యూషను తన దత్త పుత్రికగా ప్రకటించేశాడు. ఆ బాలిక కోలుకున్న తర్వాత ప్రగతి భవన్‌లోని తన ఇంటికి కేసీఆర్ పిలిపించుకున్నాడు. కలిసి భోజనం చేశారు. ఉన్నత చదువు చదవాలని, తానే పెళ్లి చేస్తానని, అన్ని రకాలుగా సాయంగా ఉంటానని అప్పట్లో కేసీఆర్ భరోసా ఇచ్చారు.
ఐఏఎస్ అధికారి రఘునందన్‌రావే ప్రత్యూష సంరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన పర్యవేక్షణలోని మహిళా శిశు సంక్షేమశాఖ ఆమె యోగక్షేమాలను చూస్తోంది. ప్రత్యూష నర్సింగ్ పూర్తి చేయగా.. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తోంది.
Also Read: వరద ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను నియమించాలి: కేటీఆర్
ఇప్పుడు ప్రత్యూష పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తాను కోరుకున్న యువకుడితో జీవితాన్ని పంచుకోబోతోంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో రాంనగర్‌కు చెందిన చరణ్‌రెడ్డితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. వరుడు ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్ ఆమెకు కొత్త జీవితం ఇచ్చేందుకు ఇష్టపూర్వకంగా ముందుకొచ్చినట్లు చెప్పాడు. తన మనసులో మాటను ప్రత్యూషతో పంచుకోవడంతో ఆమె అంగీకరించింది.
ఈ విషయాన్ని మహిలా శిశుసంక్షేమ శాఖ అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే ప్రత్యూషను ప్రగతి భవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. వరుడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. చరణ్‌రెడ్డిది మంచి కుటుంబమని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం. కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళాశిశు సంక్షేమశాఖ కమిషనర్ డి.దివ్య నిన్న ప్రత్యూష నిశ్చితార్థానికి వెళ్లారు. ఆ నిశ్చితార్థ వేడుకను తమ శాఖ తరపున పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యూష మాట్లాడుతూ తాను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. సీఎం అండతో కోలుకున్నానని, పెళ్లి బంధంతో మంచి కుటుంబంలోకి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. సీఎం కేసీఆర్ తమ పెళ్లికి వస్తానని హామీ ఇచ్చారని తెలిపింది.