నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత మనవీయకోణంలో మంచి సహాయం చేశారు. రోడ్డు ప్రమాదంలో భార్య, కూతుర్ని కోల్పోయి.. గల్ఫ్ నుంచి రాలేక.. వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలు చూసి కుమిలిపోయిన ఓ వ్యక్తికి అండగా నిలిచారు. అతనికి కోట్ల రూపాయల డబ్బులేమి ఇవ్వలేదు, విలువైన వస్తువులు కొన్నివ్వలేదు కానీ, అంతకంటే గొప్పపని చేసి కవిత మానవత్వం చాటుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన శ్రీనివాస్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మే 15న మందమర్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి భార్య సుజాత, పెద్ద కుమార్తె కావ్య ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్ నుంచి వచ్చే అవకాశం లేకపోవడంతో.. శ్రీనివాస్ చిన్నకూతురే అంత్యక్రియలు నిర్వహించింది.
వందే భారత్ మిషన్ లో భాగంగా శ్రీనివాస్ రెండు రోజుల క్రితం హైదరాబాద్ తిరిగొచ్చాడు. నిబంధనల ప్రకారం అతణ్ని ప్రభుత్వం క్వారంటైన్ లో ఉంచింది. తన భార్య అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన శ్రీనివాస్.. పెద్ద కర్మలకు కూడా హాజరు కాలేకపోతానేమోనని ఆందోళన చెందాడు. దుబాయ్ లో ఉన్న తన మిత్రులకు ఈ విషయాన్ని తెలియజేశాడు.
వారు ఈ విషయాన్ని మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డికి విషయాన్ని వివరించారు. డీజీపీ అనుమతి తీసుకొని తన ఆఫీస్ సిబ్బంది ద్వారా ప్రత్యేక వాహనంలో శ్రీనివాస్ ను సొంతూరు పంపించారు. కవిత సహకారంతో భార్య, కూతురి పెద్ద కర్మలో పాల్గొన్న శ్రీనివాస్.. చిన్న కూతుర్ని, తల్లిని కనీసం తాకడానికి కూడా వీల్లేకపోవడంతో కుమిలిపోయాడు. అతణ్ని ఓదార్చిన పోలీసులు ఓ కుర్చీలో కూర్చోబెట్టారు. దశ దిన కర్మలు పూర్తయిన అనంతరం అతణ్ని తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లారు.