
లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడగా, థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి టాలీవుడ్లో పోస్టు ప్రొడక్షన్ పనులు, షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సందడి మొదలైంది. లాక్డౌన్లో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. సోషల్ మీడియాలో తమ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. అప్పుడప్పుడు ‘ది రియల్ మేన్ ఛాలెంజ్’, ‘పిల్లో ఛాలెంజ్’, ‘మేకప్ ఛాలెంజ్’ అంటూ అలరించారు. కొందరు హీరోయిన్లు హాట్ హాట్ ఫొటోలతో వేసవిని మరింత హీటెక్కించి అందరి అటెన్షన్ వాళ్ల వైపు తిప్పుకున్నారు. హీరోలైతే ఫ్యామిలీతో గడిపేందుకే మొగ్గుచూపారు. తాజాగా షూటింగులు పట్టాలెక్కనుండటంతో విడుదలకు సిద్ధంగా ఉన్న మూవీలు ప్రమోషన్లకు సిద్ధమవుతున్నాయి.
తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటరు’ మూవీ నుంచి ‘నో పెళ్లి’ సాంగ్ రిలీజైంది. ఈ మూవీని హీరో నితిన్ విడుదల చేశాడు. సాంగ్లో సాయిధరమ్ తేజుతోపాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దగ్గుపాటి రానా కన్పించారు. పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే అనర్థాలను ఈ పాటలో మెగా హీరోలు విన్నించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నితిన్ ఈ పాటను విడుదల చేయగా రానా నో పెళ్లి పాటలో కన్పించడం ఆసక్తిని రేపుతోంది. ‘సోలో బ్రతుకే సో బెటరు’ మూవీకి సుబ్బు దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతాన్ని అందించాడు. ఎస్వీసీసీ బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. లాక్డౌన్లో లేకపోతే ఇప్పటికే ఈ మూవీ థియేటర్లో రిలీజయ్యేది. ప్రస్తుతం సినిమా షూటింగు చివరి దశకు చేరుకోవడంతో త్వరలో సినిమాను పూర్తి చేసి థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పటి నుంచి సినిమా ప్రమోషన్ పై ‘సోలో బ్రతుకే సో బెటరు’ మూవీ చిత్రబృందం దృష్టిసారించింది. ఈ మూవీలో సాయిధరమ్ కు జోడీగా నభానటేష్ నటిస్తుంది.
