https://oktelugu.com/

కవితమ్మ గెలుపు కుటుంబస్వామ్యమా? ప్రజాస్వామ్యమా?

కల్వకుంట్ల కవిత ఈ పేరు తెలియనివారు తెలంగాణాలో, ఆంధ్రలో ఎవరూ లేరు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ముద్దుల కూతురు. ఎప్పుడూ చిరునవ్వుతో పదిమంది మనసుల్ని ఆకట్టుకున్న తెలంగాణా బతుకమ్మ ఫేం కవిత. ప్రస్తుతం మరొక్కసారి వార్తల్లోకి ఎక్కింది. ఆవిడ ఎక్కడయితే పార్లమెంటు ఎన్నికల్లో ఓడిందో అక్కడే అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించిందనేది పేపర్లు, చానళ్ళు కోడై కూస్తున్నాయి. మరి కెసిఆర్ అజమాయిషిలో వున్న ప్రచార సాధనాలా మజాకా? మనదేశంలో వందిమాగధులకేమీ తక్కువలేదు. అది ఏ పార్టీ […]

Written By:
  • Ram
  • , Updated On : October 13, 2020 / 09:01 PM IST
    Follow us on

    కల్వకుంట్ల కవిత ఈ పేరు తెలియనివారు తెలంగాణాలో, ఆంధ్రలో ఎవరూ లేరు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ముద్దుల కూతురు. ఎప్పుడూ చిరునవ్వుతో పదిమంది మనసుల్ని ఆకట్టుకున్న తెలంగాణా బతుకమ్మ ఫేం కవిత. ప్రస్తుతం మరొక్కసారి వార్తల్లోకి ఎక్కింది. ఆవిడ ఎక్కడయితే పార్లమెంటు ఎన్నికల్లో ఓడిందో అక్కడే అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించిందనేది పేపర్లు, చానళ్ళు కోడై కూస్తున్నాయి. మరి కెసిఆర్ అజమాయిషిలో వున్న ప్రచార సాధనాలా మజాకా? మనదేశంలో వందిమాగధులకేమీ తక్కువలేదు. అది ఏ పార్టీ అధికారంలో వున్నా జరిగేదే. కాకపోతే కెసిఆర్ అధికారంలో అది పరాకాష్టకు చేరింది. ఒక్క మాధ్యమం కూడా ఒక్క మాట కెసిఆర్ కి, కెసిఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా రాసే దమ్ము, ధైర్యం లేదు. రాస్తే వంద మైళ్ళ లోపల పాతరేస్తారేమోనని భయం కదా. ఇంతకీ కవిత ఎన్నికని ఎలా చూడాలి?

    కవిత ఎంఎల్ సి ఎన్నిక ఆవిడ ప్రతిష్టను పెంచిందా?

    కవిత కెసిఆర్ కుటుంబంలోని అందరిలాగా మాటకారి. పోయిన లోక్ సభలో ఇంగ్లీష్ లో, హిందీలో అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకుంది. అప్పటి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దగ్గర చొరవున్న వ్యక్తుల్లో ఒకరు. తెలంగాణా ఉద్యమంలో తెలంగాణా సంస్కృతిని పైకి తీసుకురావటానికి ఊరూరా తిరిగి కృషి చేసింది. బతుకమ్మ అంటే కవితమ్మ లాగా తెలంగాణా సమాజంలో పేరు సంపాదించింది. దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం బతుకమ్మ సంబురాలను ఘనంగా పరిచయం చేసింది. అంతవరకు తన కృషి అభినందనీయమే. ప్రతి ఒక్కరు హర్షించదగ్గదే. ఆ తర్వాత పార్లమెంటు లో కూడా తన ప్రతిభని నిరూపించుకుంది. అంతవరకూ బాగానే వుంది. కానీ పోయిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాదు పార్లమెంటుకి పోటీ చేసి ఓడిపోయింది. ఇది జరిగి కేవలం ఒకటిన్నర సంవత్సరం అయ్యింది. ఆవిడ ఓడిన దగ్గర్నుంచి తను ఎంఎల్ సిగా  తెలంగాణా మండలి లోకి అడుగుపెడుతుందని ప్రచారం జరుగుతుంది. అంటే ఏమిటి కెసిఆర్ కుటుంబంలో ఎవరూ ప్రజలు ఓడించినా పదవిలో ఉండాల్సిందేనన్నమాట. అలా జరగకపోతే ప్రజాస్వామ్యం గొడ్డు పోతుంది సుమా.

    ఇక కవిత ఎన్నిక అద్భుత విజయంగా వర్ణించటం, ఓడిన చోటే గెలిచి చూపించిందని చెప్పటం వింటే ఈ వంది మాగధుల పొగడ్తలు ఎంత నవ్వుస్తున్నాయో. అసలు పార్లమెంట్ ఎన్నికకు ఈ ఎన్నికకు ఏమైనా పోలిక ఉందా? అది లక్షలాది మంది ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నిక. ఇది కేవలం కొన్ని వందల మంది ఎన్నికల క్షేత్రం. ఈ రెండింటికీ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంది. అదెక్కడా ఇదేక్కడా? ఇది కొద్దిమంది స్థానిక ప్రతినిధులు ఎన్నుకొనే ప్రక్రియ. దీనిలో సహజంగా అధికార పార్టీ ప్రాబల్యం ఎక్కువగా వుంటుంది. అందునా కెసిఆర్ గారి ముద్దుల పుత్రిక కూడాను. ఆ మాత్రం అధికార దర్పం, ప్రభు భక్తీ కలగలిపి ప్రతిబింబించక పోతే ఇంకేమైనా ఉందా? ఈ మాత్రం దానికి ఇంత హడావిడా? కనీసం గ్రాడ్యుయేట్ ఎన్నికైనా కొంత అర్ధముండేదేమో. కవిత ప్రతిభగల నాయకురాలనే దాంట్లో మాకేమీ సందేహంలేదు. కాకపోతే ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు కూడా పదవి లేకుండా వుండలేకపోవటం, వడ్డించేవాడు మనవాడయితే పదవులకేమి కొరత అనే సామెతను నిజం చేస్తున్నందుకే మా ఆవేదన. అదే పార్టీకోసం పనిచేసిన ఇంకో కార్యకర్త కు అవకాశం పోగొట్టినట్లే కదా.

    కవిత మంత్రి పదవి ఖాయమా?

    అవుననే అనిపిస్తుంది. అదే కాకపోతే ఒక ఎంపిగా చేసిన వ్యక్తిని తీసుకొచ్చి ఎంఎల్ సి చేయాల్సిన అవసరం ఏముందనేది సామాన్యుడికి కూడా అర్ధమవుతున్న విషయం. నాకు తెలిసి ఈ స్థాయిలో కుటుంబాన్ని ప్రమోట్ చేసిన కుటుంబం దేశంలోనే లేదేమో. కెసిఆర్ కు పోటీ లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, హెచ్ డి దేవగౌడ లు మాత్రమే వున్నారు. అఫ్కోర్స్ నెహ్రు-గాంధీ కుటుంబం ఉండనే వుంది. ఆంధ్రలో ఎన్టిఆర్ కుటుంబం కూడా ఈ స్థాయిలో లేదేమో. ఘన చరిత్ర కలిగిన తెలంగాణా చివరకి వారసత్వ రాజకీయాల్లో మునిగి తేలుతుంది. నీ బాంచను కాల్మొక్తా అని నిజాంని కీర్తించిన చరిత్రని మరొక్కసారి గుర్తు చేస్తుంది వర్తమాన చరిత్ర. ఇప్పటికే కెసిఆర్ తో పాటు, కే టి ఆర్, హరీష్ రావు తమ కుటుంబంలో నుంచి పదవుల్లో వున్నారు. అలాగే జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్య సభ సబ్యుడిగా వున్నాడు. ఇప్పుడు కవిత కూడా పరోక్ష ఎన్నికల్లో గెలిచి పదవినలంకరించ బోతుందనే వార్త వినటానికే రోత పుట్టిస్తుంది. ఆ పదవి కెసిఆర్ కుటుంబంకి రావాలంటే ఇప్పుడున్న వాళ్ళు ఎవరో ఒకరు తప్పుకోవాలి. అదీ కెసిఆర్ కుటుంబేతర మంత్రి అయ్యుండాలి. ఇంత దారుణమైన కుటుంబ రాజకీయాలు తెలంగాణా ప్రజలు భరించాలా? ఇందుకోసమేనా తెలంగాణా సాధించుకుంది? ఇప్పటికైనా కెసిఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే ఇది తనకు, తన ప్రతిష్టకు మచ్చ తగులుతుందని మరిచిపోవద్దు. ఇందులో కవిత మీదో కెసిఆర్ కుటుంబం మీదో వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదు. కాకపోతే ఇప్పటికే వారసత్వ రాజకీయాల పర్వం దేశంలో శృతి మించింది. దీనికి ఎక్కడోచోట ఫులు స్టాప్ పెట్టాలి. ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం, కుటుంబస్వామ్య మవుతుందనేదే మా ఆవేదన. కెసిఆర్ గారూ  మరొక్కసారి పుత్ర/పుత్రికా ప్రేమని పక్కకు పెట్టి ప్రజాస్వామ్య స్పూర్తితో ఆలోచిస్తారని ఆశిస్తున్నాము.