New zealand vs Australia : సొంత గడ్డపై ఏ క్రికెట్ జట్టు కైనా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఈ విషయంలో న్యూజిలాండ్ జట్టుకు ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టుతో ఆడుతున్న టి20 సిరీస్ లో కివీస్ ఆటగాళ్ల ప్రదర్శన అలా ఉంది మరి. మూడు టి20 మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి టీ20లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయింది. శుక్రవారం జరిగిన రెండో టి20 లో గెలుస్తుంది అనుకుంటే సమిష్టి వైఫల్యంతో సిరీస్ చేజార్చుకుంది. ఏకంగా ఆస్ట్రేలియా చేతిలో 72 పరుగుల తేడాతో దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది.
శుక్రవారం జరిగిన రెండవ టి20 మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 19. 5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్( 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్ లతో 45), మిచెల్ మార్ష్( 21 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్ లతో 26), ప్యాట్ కమిన్స్ (22 బంతుల్లో 5 ఫోర్లతో 28) న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురు దాడి చేశారు. కివీస్ బౌలర్లలో లాకి ఫెర్గు సన్ (4/41) నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. మిల్నే, బెన్ సియర్స్, సాంట్నర్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం కివీస్ జట్టు లక్ష్య చేదనకు దిగింది. 17 ఓవర్లలో 102 పరుగులకు ఆల్ అవుట్ అయింది. న్యూజిలాండ్ జట్టుకు చెందిన గ్లెన్ పిలిప్స్ ( 35 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్ లతో 42 పరుగులు) సత్తా చాటాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించకపోవడంతో న్యూజిలాండ్ 102 పరుగులకు చాప చుట్టేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా 4 వికెట్లు తీశాడు. నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హజల్ వుడ్, కమిన్స్, మిచెల్ మార్ష్ చెరో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా విజయంలో కమిన్స్ కీలక పాత్ర పోషించాడు. అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. వరుసగా 2 t20 మ్యాచ్ లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ దక్కించుకుంది.