రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కానీ బీహార్ లో చోటుచేసుకున్నట్టు తెలంగాణలోనూ ఆ సంస్కృతి కొత్తగా బయటపడింది. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడక్కడ పోటీకి రెడీ అయిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థిని చంపేస్తామంటూ బెదిరించడం తీవ్ర కలకలం రేపింది.
Also Read: ఆర్టీసీ జాప్యం.. ‘ప్రైవేటు’కు లాభం?
దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణలో హీట్ పుట్టిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటీచేస్తామని ప్రకటించాయి. బిగ్‌బిస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కత్తి కార్తీక ఇప్పుడు దుబ్బాక బరిలో నిలుస్తోంది. నెల రోజులుగా కార్తీక నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుంటోంది. ఓటర్లను కలుస్తూ మద్దతు కోరుతూనే ఉంది. షెడ్యూల్ రాకముందే అప్పుడే నియోజకవర్గంపై వాలిపోయిన కార్తీకకు ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు వచ్చాయట. అంతేకాదు కార్తీక డ్రైవర్‌పై ఏకంగా దాడి కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కార్తీక డ్రైవర్‌పై దాడికి దిగినట్టు ఆమె రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో డ్రైవర్ షరీఫ్ హైదరాబాద్ నుంచి దుబ్బాకకు వస్తున్న క్రమంలో ఈ దాడి జరిగినట్లు ఫిర్యాదులో చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. ‘గుర్తు తెలియని వ్యక్తులు సిల్వర్ కలర్ ఇన్నోవా కారులో వచ్చి డ్రైవర్ షరీఫ్‌ను అడ్డగించారు. నీవు కత్తి కార్తీక డ్రైవర్‌వు కదా అంటూ అడిగి బెదిరించారు. నిన్ను మీ మేడంను సజీవంగా కాల్చివేస్తామన్నారు. వారి బెదిరింపులతో డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయి వచ్చారు’ అని కార్తీక తన ఫిర్యాదులో తెలిపారు. దీంతో ఇప్పుడు దుబ్బాక రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి.
Also Read: ఉద్యోగాలు కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి
దుబ్బాక నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ప్రచారాన్ని కత్తి కార్తీక మొదలుపెట్టి జనాల్లోకి వెళుతున్నారు. ప్రతీ గ్రామంలో నిరుద్యోగ యువత, పేద ప్రజలతో కలిసి వారి సమస్యలను వింటున్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి బహుజన అభ్యర్థిగా పాటుపడుతానని హామీలు గుప్పిస్తున్నారు. దీంతో ఆమెకు యువత, నిరుద్యోగుల నుంచి మంచి స్పందనే వచ్చింది. పలు కుల సంఘాలు కూడా ఆమెకు స్వాగతం పలుకుతూ సన్మానం చేశారు. ఈ క్రమంలోనే ఆమె ముందస్తు ప్రచారాన్ని తట్టుకోలేక బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.