https://oktelugu.com/

Karnataka Election Results 2023: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు.. తెలంగాణలో ఊపిరి

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కాస్తో కూస్తో బలంగా ఉందంటే దానికి రేవంత్ రెడ్డి కారణం అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను బయట పెట్టడంలో ఆయన తనవంతు పాత్ర పోషిస్తున్నారు.

Written By: , Updated On : May 13, 2023 / 01:06 PM IST
Karnataka Election Results 2023

Karnataka Election Results 2023

Follow us on

Karnataka Election Results 2023: ఈ ప్రకృతిలో ఎక్కడో జరిగే సంఘటన.. మరో సంఘటనను ప్రేరేపిస్తుంది అంటారు. దీనినే కార్యకారక సంబంధం అంటారు. ఈ ప్రకారం ప్రస్తుతం కర్ణాటకలో సాధించిన విజయం తెలంగాణలో కూడా పునరావృతమవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కార్యకారక సంబంధం తమ పార్టీ విషయంలో మరింత నిజమవుతుందని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 117 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టగా.. పట్టణ ప్రాంతానికి చెందిన ఓటర్లు బిజెపికి పట్టం కట్టారు.

తెలంగాణలో ఇదీ పరిస్థితి

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉంది. అయితే అందులోని గ్రూపులు ఆ పార్టీని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన స్థానాలు సాధించింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. కెసిఆర్ తనకున్న రాజకీయ చతురతతో చాలావరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకున్నాడు. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదానే ఇచ్చారు. ఆయన అప్పటికి ఆ పార్టీలోని సుమారు అయిదుగురు ఎమ్మెల్యేలను కెసిఆర్ తన పార్టీలోకి లాక్కున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని తొక్కి తొక్కి నాశనం చేశాడు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కాస్తో కూస్తో బలంగా ఉందంటే దానికి రేవంత్ రెడ్డి కారణం అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను బయట పెట్టడంలో ఆయన తనవంతు పాత్ర పోషిస్తున్నారు. సీనియర్లు సహకరించకపోయినప్పటికీ తాను పార్టీ అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.. అంతేకాదు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి వారితో భారీ సమావేశాలు నిర్వహించి కేడర్లో ఉత్సాహం నింపే చర్యలు తీసుకుంటున్నారు.

ఆ రాష్ట్ర ప్రభావం కచ్చితంగా ఉంటుంది

దక్షిణాది రాష్ట్రంలో కర్ణాటక ప్రాంతం మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.. ఈ ప్రాంతం దక్షిణాది రాష్ట్రంలో చాలా కీలకం. అయితే కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున ఆ ప్రభావం తెలంగాణపై కచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఓటర్లలో చైతన్యం ఎక్కువ. పైగా అధికార పార్టీల దాష్టీకం పెరిగిపోయిన నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.. ఇందులో భాగంగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే సీన్ రిపీట్ చేస్తారని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ప్రజలు ఓటు వేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్న అనైక్యత దెబ్బతీస్తోంది.. అయితే కర్ణాటక ఫలితాన్ని చూసైనా తెలంగాణ ప్రాంత నాయకులు మారతారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో దక్కిన గెలుపును బూస్టప్ గా తీసుకొని 2024లో జరిగే ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. 2019 ఎన్నికల్లోను ఇదేవిధంగా రాజస్థాన్, చత్తీస్గడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. సార్వత్రిక ఎన్నికల్లో బొక్కా బోర్లా పడింది. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. మరి ఈ గెలుపును ఆ పార్టీ ఏ విధంగా మలుచుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కలిసికట్టుగా పనిచేస్తే ఎంతటి ప్రత్యర్థినైనా ఓడించవచ్చు అని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు వాస్తవంలో చూపించారు. మరి దీనిని తెలంగాణ రాష్ట్ర నాయకులు ఏ విధంగా అమలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది.