Karnataka CM Oath Ceremony: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఏకంగా 135 స్థానాల్లో గెలుపొంది సంచలనం సృష్టించింది. మూడు రోజులు ఉత్కంఠ తర్వాత సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ పేర్లను అధిష్టానం ప్రకటించింది. వీరితోపాటు మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందిందా అనేది ఇప్పడు చర్చనీయాంశమైంది.
కేసీఆర్‌ను దూరం పెట్టిన కాంగ్రెస్..
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, తమిళనాడు, జార్ఖండ్, బెంగాల్ సీఎంలు స్టాలిన్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ, సీపీఐ అగ్రనేతలు సీతారాం అచూరీ, డి.రాజా, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, నటుడు కమలాహాసన్ సహా మరెందరో ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాత్రం ఆహ్వానం అందలేదని సమాచారం.
ఏపీ, కేరళ సీఎంలకు కూడా..
తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు ఏపీ సీఎం జగన్, కేరళ సీఎం పినరయి విజయన్‌కు కూడా కాంగ్రెస్ ఆహ్వానం పంపలేదు. ఏపీ సీఎం జగన్‌ను కాంగ్రెస్ మొదటి నుంచి దూరం పెడుతుంది. దాదాపు ఆహ్వానించడం అనుమానమే. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం, ఇతర పక్షం ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తుండడంతో కాంగ్రెస్ ఆయనపై కొంత అసంతృప్తి గా ఉన్నట్లు సమాచారం. మరోవైపు మరో ఐదు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌కు దీటుగా కాంగ్రెస్ పోటీ పడుతుంది. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుంది. ఈ పరిస్థితిలో కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ను పిలిస్తే పార్టీ క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని అధిష్టానం భావిస్తోంది. మరోవైపు బీజేపీకి కూడా అస్త్రం దొరుకుతుందని ఆలోచన చేసింది. అందుకే కేసీఆర్‌కు కూడా ఆహ్వానం ఇవ్వనట్లు సమాచారం. ఈ పరిస్థితిలో ఆహ్వానం అందే అవకాశం కూడా కనిపించడం లేదు. ఇక కేరళలో కాంగ్రెస్ విపక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సఖ్యత లేదు. దీంతో ఆయనకు కూడా ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది.