Karnataka Result 2023: నేడే కన్నడ ఫలితం: కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలు, యడ్యూరప్ప ఇంట్లో బిజెపి మంతనాలు

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తే దేశ రాజకీయాల్లో ఆ పార్టీ పునరుజ్జీవం పొందే అవకాశం ఉంటుంది. ఇక భారత జనతా పార్టీ కర్ణాటకలో మళ్లీ విజయం సాధిస్తే తెలంగాణలోనూ పాగా వేసేందుకు అవకాశం ఉంటుంది.

Written By: K.R, Updated On : May 13, 2023 8:03 am

Karnataka Result 2023

Follow us on

Karnataka Result 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. కాంగ్రెస్, బిజెపి మధ్య జరిగిన పోటీలో ఎవరు గెలుస్తారు అనేది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేసుకున్న అన్ని పార్టీలు ఒకవేళ హంగ్ వస్తే ఏం చేయాలి అనేదానిపై తీవ్ర మంతనాలు జరుపుతున్నాయి. ఒకవేళ ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజార్టీ రాకపోతే చక్రం తిప్పేందుకు జెడిఎస్ కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. ఇక ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రాల్లో లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

మధ్యాహ్నం వరకు ఒక స్పష్టత

అయితే ఎన్నికల లెక్కింపుకు సంబంధించి మధ్యాహ్నం వరకు ఒక స్పష్టత వస్తుందని ఎన్నికల సంఘం చెబుతోంది. వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయని వివరిస్తున్నది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక శాసనసభలో ఈనెల 10న జరిగిన పోలింగ్లో 73.19% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటివరకు ఈ ఎగ్జిట్ పోల్స్ అందించిన వివరాల ప్రకారం కాంగ్రెస్, తీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరిగా జరిగిందని తెలుస్తోంది.. అయితే మెజారిటీ సంస్థలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. ఇదే సమయంలో హాంగ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని స్పష్టం చేశాయి. 2018 లో జరిగిన ఎన్నికల్లో 104 సీట్లల్లో గెలుపొంది బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 స్థానాల్లో విజయం సాధించింది.. పార్టీ 38.4% ఓట్ల షేర్ దక్కించుకుంది. బిజెపి 36.2 శాతం, జెడిఎస్ 18.36% ఓటు బ్యాంకు సొంతం చేసుకున్నాయి.

ఇంతకీ ఏం జరుగుతోంది

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధిస్తే దేశ రాజకీయాల్లో ఆ పార్టీ పునరుజ్జీవం పొందే అవకాశం ఉంటుంది. ఇక భారత జనతా పార్టీ కర్ణాటకలో మళ్లీ విజయం సాధిస్తే తెలంగాణలోనూ పాగా వేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సానుకూల శక్తిని సాధించే అవకాశాలు కొట్టి పారేయలేనివి. ఫలితంగా ఫలితాలపై రెండు పార్టీలో తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. అయితే ఎన్నికల ఫలితాలు పై తమకు పూర్తి స్పష్టత ఉందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ చెబుతున్నారు. 141 నుంచి 150 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కనిపిస్తోందని ఆయన వివరిస్తున్నారు. ఇక అధికార బిజెపి నేతలు కూడా పైకి గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ లోలోపల అంతర్మథనం చెందుతున్నారు. ఒకవైపు ఫలితం పై భరోసా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఏదైనా తేడా కొడితే ఏం చేయాలి అనే అంశంపై మంతనాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, సహా పలువురు మంత్రులు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నివాసానికి చేరుకొని చర్చలు జరిపారు. క్షేత్రస్థాయి నుంచి బూత్ లెవెల్ వరకు తమకు స్పష్టమైన సమాచారం ఉందని, ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ రిసార్ట్ రాజకీయాలకు తెర లేపిందని, దీనిని బట్టి వారికి అధికారం రాదనే విషయం స్పష్టమవుతోందని బసవరాజ్ స్పష్టం చేస్తున్నారు. హంగ్ వస్తే జేడీఎస్ కుమారస్వామి తమ డిమాండ్లు నెరవేర్చే పార్టీకే మద్దతు ఇస్తామని ప్రకటించడంపై కూడా బసవరాజ్ తనదైన శైలిలో స్పందించారు.. ఆయన మీడియా చెవిలో చెప్పారా అంటూ చురకలు అంటించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా బిజెపికి అధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 115 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు.