Karnataka MLAs
Karnataka MLAs : కర్ణాటక అసెంబ్లీ(Karnataka assembly)లో కొంతకాలంగా ఎమ్మెల్యేల గైర్హాజరు పెరిగిపోతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అసెంబ్లీలో ఉంటున్న ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోతున్నారు. దీంతో కీలకమైన చర్చలు జరగకుండా పోతున్నాయి. బిల్లులు ఆమోద ముద్రకు నోచుకోవడం లేదు. దీని నివారణకు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖాదర్(Karnataka assembly speaker khadar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో శాసనసభ్యులు మధ్యాహ్నం దాకా ఉండడం.. మధ్యాహ్నం భోజనం చేసి కునుకు తీసేందుకు ఉపక్రమించడంతో అసెంబ్లీ బోసి పోయి కనిపిస్తోంది. దీంతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఎమ్మెల్యేలు విశ్రాంతి తీసుకోవడానికి రిక్లైనర్లు (Recliner) ఏర్పాటు చేయాలని ఖాదర్ నిర్ణయించారు. దీనివల్ల ఎమ్మెల్యేలకు విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని.. తద్వారా ఎమ్మెల్యేల గైర్హాజరు తగ్గుతుందని స్పీకర్ భావిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలో మార్చి మూడు నుంచి 21 వరకు సమావేశాలున్నాయి.. ఎమ్మెల్యేల కోసం 15 వరకు రిక్లైనర్లను అద్దెకు తీసుకుంటామని స్పీకర్ ఖాదర్ వివరించారు.. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి.. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
రిక్లెనర్ ల వల్ల విశ్రాంతి
రిక్లైనర్ లు సాధారణ సోఫాలమాదిరిగా ఉండవు. ఇవి భారీ పరిమాణంలో ఉంటాయి. దూది అధికంగా ఉపయోగించడం వల్ల మెత్తగా ఉంటాయి. ఫుష్ బ్యాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల నడుం నొప్పి ఉండదు. పైగా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నడుము అలా వాల్చి కునుకు కూడా తీయవచ్చు. అందువల్లే రిక్లైనర్లను అద్దెకు తీసుకుంటున్నామని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఖాదర్ చెప్తున్నారు. ” కర్ణాటక అసెంబ్లీలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సభ్యుల హాజరు భారీగానే ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత సభ్యులు రావడం లేదు. దీనికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే.. భోజనం తర్వాత సభ్యులు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనివల్ల సభ లో సభ్యులు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నారు. దీనివల్ల కీలక బిల్లులు ఆగిపోతున్నాయి. చర్చలు జరగడం లేదు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతానికైతే 15 రిక్లైనర్లు అద్దెకి తీసుకుంటున్నాం. ఇది కనుక మంచి ఫలితాలను ఇస్తే.. శాశ్వతంగా రిక్లైనర్లు ఏర్పాటు చేస్తామని” స్పీకర్ ఖాదర్ వివరించారు. మరోవైపు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్యేలకు రిక్లైనర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని.. భోజనం చేసిన తర్వాత కునుకు తీసేందుకు ఆరాటపడుతున్న వారు ఎమ్మెల్యేగా పనికిరారని ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు.