Karnataka Minister KN Rajanna: ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి తొత్తుగా మారిపోయిందని.. ఎన్నికల్లో ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతున్నారని కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. తమ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటక రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
Also Read: క్రికెట్ లో సంచలనం.. ఐదు బంతుల్లోనే టార్గెట్ ఛేదించారు
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది. అక్రమాలకు సంబంధించి ఆధారాలు చూపించాలని ఆ నోటీసులలో పేర్కొంది. అయితే దీనిపై ఇంతవరకు రాహుల్ గాంధీ ఎన్నికల సంఘానికి ఎటువంటి ఆధారాలు చూపించలేదు. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రాహుల్ గాంధీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. స్వయం ప్రతిపత్తిగా పనిచేస్తున్న ఎన్నికల సంఘాన్ని తన రాజకీయ స్వలాభం కోసం రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఒక విధంగా.. ఓడిపోతే మరొక విధంగా రాహుల్ గాంధీ ప్రవర్తించడం అలవాటుగా మారిపోయిందని వివరిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి రాహుల్ గాంధీలో ఫ్రస్టేషన్ పీక్స్ లోకి వెళ్లిందని అంటున్నారు.
రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరిని సొంత పార్టీలో నేతలే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటకలోని రాజన్న అనే దళిత మంత్రి రాహుల్ గాంధీ అనుసరిస్తున్న విధానాలను మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు. సహజంగానే ప్రశ్నించే స్వభావాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేదు. పైగా రాహుల్ గాంధీని విమర్శిస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పెద్దలు ఒకసారి అలర్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం మీద యుద్ధం చేస్తున్న రాహుల్ గాంధీకి రాజన్న చేస్తున్న వ్యాఖ్యలు ఒక రకంగా కంటగింపుగా మారాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజన్నను క్యాబినెట్ నుంచి తొలగిస్తూ ప్రకటన చేసింది. ఒకవైపు ఎన్నికల సంఘం అక్రమాలు చేసిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తుంటే.. రాహుల్ గాంధీ విధానాలు సరికాదని సొంత పార్టీలోని మంత్రి విమర్శించడం విశేషం. అయితే సొంత పార్టీలోనే ఇలా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో రాజన్నను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్యాబినెట్ నుంచి తొలగించడం విశేషం.