హనుమంతుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాడని, తిరుమల కొండల్లోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని ఆ మధ్య ప్రకటించింది టీటీడీ. అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో మారుతి జన్మించాడని ప్రకటించింది. ఈ ప్రకటనపై అప్పట్లోనే చాలా అభ్యంతరాలు వచ్చాయి.
మొదటగా కర్నాకట స్పందించింది. తమ రాష్ట్రంలోని హంపి దగ్గర్లో ఉన్న ఆంజనేయాద్రి కొండ హనుమంతుడి జన్మస్థలమని ప్రకటించింది. రామాయణంలోనూ ఈ విషయం ఉందని తెలిపింది. అయితే.. తాజాగా కర్నాటకలోని కిష్కింధ దేవస్థానం అధికారులు.. టీటీడీకి లేఖ కూడా రాసినట్టు సమాచారం. అందులో.. అజ్ఞానపు, మూర్ఖపు పనులు చేయొద్దని ఘాటుగా పేర్కొన్నట్టు తెలుస్తోంది.
టీటీడీ నివేదిక అభూతకల్పన అని తాము నిరూపిస్తామని, వెంటనే తమ లేఖకు సమాధానం ఇవ్వాలని కూడా కోరినట్టు సమాచారం. దీంతో.. ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నిజానికి హనుమంతుడి జన్మస్థానం తిరుమలేనని టీటీడీ ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో అర్థం కావట్లేదని చాలా మంది భక్తులు అంటున్నారు.
తిరుపతిలోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థానమని కొత్తగా చరిత్రకారులు ఎవరూ కనుగొన్నది లేదు. అలాంటప్పుడు.. ఎలా ప్రకటించారో తెలియట్లేదని అంటున్నారు. ఒకవేళ నిజమైన ఆధారాలు ఉండి ఉంటే.. ఇప్పటికే హన్మంతుడి జన్మస్థానాలుగా చెబుతున్న ఆయా ప్రాంతాల వారికి సమాచారం ఇచ్చి, వారితో చర్చించి, అందరి వద్దా ఉన్న ఆధారాలను పరిశీలించి ప్రకటిస్తే బాగుండేదని అంటున్నారు.
ఇవన్నీ చేయకుండా.. ఏకపక్షంగా తిరుమలే హనుమంతుడి జన్మస్థానం అని ప్రకటించడం ద్వారా.. తిరుపతి దేవస్థానాన్ని వివాదాల్లోకి తేవడం మినహా.. టీటీడీ బోర్డు సాధించింది ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. మరి, దీనికి బోర్డు ఏం చెబుతుందో?