Karnataka Elections 2023: కన్నడ ఓటర్లు ఈసారి ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారా? అధికార పార్టీ పాలనలో ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారా? అవినీతి ఆరోపణలు వారికి ఇబ్బంది కలిగిస్తున్నాయా? రోజుకు ఒక వివాదం వారికి చికాకు పుట్టిస్తోందా? స్వచ్ఛమైన కస్తూరి లాంటి తమ రాష్ట్రాన్ని ఎటువంటి గొడవలు లేని ప్రాంతంగా చూడాలి అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తున్నది. టీవీ9, సీ ఓటర్స్ నిర్వహించిన సర్వేలో ప్రజల మనోగతం స్పష్టంగా కనిపించింది.
కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 50 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను తెలుగు ప్రజలు నిర్దేశించగలరు. అంటే ఆ ప్రాంతాలు మొత్తం ఒకప్పుడు నిజాం ఏలుబడిలో ఉండేవి.. ఇక నామినేషన్లకు గడువు పూర్తి కావడం, వచ్చే నెలలో ఎన్నికలు జరగనుండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఈసారి భారతీయ జనతా పార్టీ చాలామంది సీనియర్లకు టికెట్లు ఇవ్వలేదు. కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అసంతృప్త నేతలను చేర్చుకుంటున్నది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు జగదీష్ శెట్టార్ ను చేర్చుకుని కమల నాధులకు షాక్ ఇచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు ఇది భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. ఇక కుమారస్వామి పార్టీ కూడా జోరుగానే ప్రచారం సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం మీద టీవీ9 కన్నడ, సీ ఓటర్స్ సర్వే నిర్వహించింది.. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించింది.
ఈ సర్వేలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికార పార్టీ పాలనతో తాము విసిగిపోయి ఉన్నామని వాపోయారు. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు తమల్ని ఇబ్బంది పెడుతున్నాయని వివరించారు. రోజుకు ఒక వివాదం తమ కంటికి కునుకు లేకుండా చేస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాము ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నామని చెబుతున్నారు. టీవీ9 చేసిన సర్వే ప్రకారం మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 106 నుంచి 116 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. బిజెపి 79 నుంచి 89 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక కుమారస్వామి పార్టీ 24 నుంచి 34 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇతరులు ఐదు స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. అయితే కన్నడ నాట న్యూస్ వన్ ఛానల్ చేసిన సర్వేలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేలింది. ఎందుకంటే ఈ న్యూస్ ఛానల్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. కానీ ఆ ఛానల్ చేసిన సర్వేలో బిజెపి విజయం సాధిస్తుందని తేలడం ఆశ్చర్యకరం.
ఇక ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరికివారు ఉచిత హామీలు ఇస్తున్నారు. స్థాయి మించి విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ప్రధానమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రియాంక గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులం మేమంటే మేమని సిద్ధరామయ్య, ఇంకా కొంతమంది ప్రకటించుకుంటూ ఉండటం విశేషం.
TV9 Kannada – C Voter survey predicts clear majority for Congress in #KarnatakaElection2023 !
Congress: 106-116
BJP: 79-89
JDS: 24-34
Others: 0-5 #CongressBaralidePragatiTaralide pic.twitter.com/eKeb4f5hDW— Basavaraj Sankin (@BSSankin_) April 25, 2023