Karnataka: సాధారణంగా పారిశుధ్యానికి నగరపాలక సంస్థలు భారీగా ఖర్చు పెడుతుంటాయి. ఒకప్పుడు పారిశుద్ధ్య నిర్వహణ మొత్తం మనుషులు చేసేవారు. అయితే నగరాలు విస్తరించడం వల్ల.. శివారు ప్రాంతాలు పెరిగిపోవడం వల్ల పారిశుద్ధ్య నిర్వహణ మనుషుల వల్ల కావడం లేదు. అందుకే నగరపాలక సంస్థలు చెత్త ఊడ్చడానికి ఖరీదైన యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వీటిని కొనుగోలు చేయాలంటే భారీగా డబ్బులు కావాలి. అందువల్లే అవి అద్దె ప్రాతిపదికన తీసుకొస్తుంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పటికి చెల్లించే అదే భారీగా ఉంటున్నది. వాస్తవానికి ఆ స్థాయిలో చెల్లించే అద్దె ద్వారా కొత్త యంత్రాలు కొనుగోలు చేయవచ్చు. కానీ నగరపాలక సంస్థల్లో వ్యవహారం వేరే విధంగా ఉంటుంది కాబట్టి వందల కోట్లలో అద్దె చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు.
మనదేశంలో ప్రఖ్యాత నగరపాలక సంస్థల్లో బెంగళూరు ఒకటి. బెంగళూరు నగరం మనదేశ ఐటీ రాజధానిగా పేరుపొందింది. ఇక్కడ అనేక బహుళజాతి సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. గతంతో పోల్చి చూస్తే బెంగళూరు నగరం కూడా విపరీతంగా పెరిగింది. పెరిగిన నగరానికి తగ్గట్టుగానే సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ మీద పడింది. వాస్తవానికి బెంగళూరులో రోడ్లు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇక సాయంత్రం పూట ట్రాఫిక్ చెప్పాల్సిన పనిలేదు. వర్షం కురిస్తే మాత్రం నరకం కనిపిస్తుంది. బెంగళూరులో ప్రతిరోజు చెత్త భారీగా పోగుపడుతుంది. ఇలా పోగు పడిన చెత్తను శుభ్రం చేయాలంటే కార్మికులకు తలకు మించిన భారమవుతోంది. ఏటికేడు ఈ సమస్య పెరిగిపోతున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం 613 కోట్ల విలువైనది. ఇంతటి డబ్బు పెట్టి కొత్త యంత్రాలు కొనుగోలు చేస్తున్నారనుకుంటే పొరపాటే.
బెంగళూరు నగరపాలక పరిధిలో చెత్తను శుభ్రం చేయడానికి.. రోడ్లను ఊడ్చడానికి ఏకంగా 46 స్వీపింగ్ యంత్రాలను బెంగళూరు నగరపాలక సంస్థ అధికారులు అద్దెకు తీసుకున్నారు. ఏడు సంవత్సరాలపాటు ఈ యంత్రాలను వాడుకునే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాస్తవానికి కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు నగరంలో పారిశుద్ధ్యాన్ని పరిరక్షించడానికి తీసుకున్న నిర్ణయం అభినందనీయమైనప్పటికీ.. ఇంతటి ఖర్చుపెట్టి.. అది కూడా యంత్రాలను అద్దెకు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పరిపాలనలో ఇలాంటివి సహజమేనని వ్యాఖ్యానిస్తున్నారు.