Karnataka Assembly Elections 2023: కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్నాయి. మే 10న అక్కడ పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ తగ్గడం లేదు. బిజెపి దూకుడు తగ్గించడం లేదు. మధ్యలో కింగ్ మేకర్ కావాలని కుమారస్వామి పార్టీ భావిస్తోంది. ఇలాంటి క్రమంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఐదేళ్లపాటు కన్నడ రాజ్యాన్ని ఏలుతుంది? అనే ప్రశ్నలకు లోక్ పాల్ 2.0 సర్వే క్లియర్ పిక్చర్ ఇచ్చింది.
ఇప్పటికే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఏబీపీ_ సీ ఓటర్ సర్వే ఫలితాలు వచ్చాయి. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోందని తేలిపోయింది.. తాజాగా లోక్ పాల్ 2.0 సర్వే సంస్థ తన ఫలితాలు వెల్లడించింది. ఇందులోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని తేలిపోయింది. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేరువేరుగా ఈ సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. అధికార భారతీయ జనతా పార్టీ తన స్థానాల సంఖ్యను ఫిబ్రవరి తో పోలిస్తే మార్చిలో మరింత ఎక్కువ కోల్పోయింది. మరోవైపు కుమారస్వామి పార్టీ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది అనే అంచనాలు కూడా తలకిందయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక లోక్ పాల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య ఫిబ్రవరి నెలలో 116 నుంచి 122 దాకా ఉన్నాయి. అదే మార్చినాటికి ఆ సంఖ్య 131కి పెరిగింది. దీంతోపాటు ఓటు షేరింగ్ మూడు శాతం పెంచుకుంది. అలాగే భారతీయ జనతా పార్టీకి ఫిబ్రవరిలో 77 నుంచి 83 సీట్లు వస్తాయని పేర్కొనగా.. మార్చిలో ఆ సంఖ్య 69 కి పడిపోయింది. ఓటు బ్యాంకు లోనూ మతం తరుగుదల నమోదయింది. ఇక కుమారస్వామి పార్టీకి ఫిబ్రవరిలో 27 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. మార్చిలో మాత్రం ఆ సంఖ్య 25 వరకే ఉంటుందని తేలిపోయింది. ఇక ఇతరుల సీట్లు ఫిబ్రవరిలో నాలుగు వరకు అంచనా వేయగా.. మార్చి నెలలో ఆ సంఖ్య రెండు కు పడిపోయింది.
మరోవైపు లోక్ పాల్ సర్వే ఫలితాలు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా ఎన్నికల్లో ప్రతిబింబించలేదు. ఈ సంస్థ అక్కడి ఎన్నికల్లో సర్వే నిర్వహించినప్పుడు ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. కానీ తీరా ఎన్నికల ఫలితాలు విరుద్ధంగా వచ్చాయి. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ఫలితాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతుండగా.. తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.