Jagan- Kapu Reservation: ఏపీలో కాపులకు రిజర్వేషన్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అగ్రవర్ణాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. దీంతో దశాబ్దాలుగా తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ వచ్చిన కాపులకు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఆశాదీపంగా మారింది. కాపుల రిజర్వేషన్ కోసం అటు ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకూ ఉద్యమాలు జరిగిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత మంజునాథ కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రాష్ట్రంలో కాపుల స్థితిగతులపై అధ్యయనం చేసింది. ఇంతలో చంద్రబాబు సర్కారు 2019లో కాపులకు 5 శాతం, మిగిలిన అగ్రవర్ణాలకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు. దీని కోసం ప్రత్యేక చట్టం సైతం చేశారు.

అయితే ఈ రెండు చట్టాలను సవాల్ చేస్తూ పెద్దఎత్తున కోర్టులో కేసులు దాఖలయ్యాయి. దీనినే సాకుగా చూపిన జగన్ సర్కారు కాపుల రిజర్వేషన్ అంశాన్ని పెండింగ్ లో పెట్టింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మాత్రం 10 శాతం ఈబీసీ కోటా కింద రిజర్వేషన్ కల్పిస్తూ 2021లో జూలై 14న ప్రత్యేక ఉత్తర్వులిచ్చింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈబీసీ వర్గాలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్ ను కాపులకు 5 శాతం, మిగిలిన వర్గాలకు 5 శాతం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ చాలా మంది కోర్టును ఆశ్రయించడంతోనే.. తాము కాపుల రిజర్వేషన్ ను పక్కన పెట్టినట్టు స్వయంగా ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.
కాపుల రిజర్వేషన్ అంశాన్ని సీఎం జగన్ రాజకీయంగా వాడుకున్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ నాడు మంజునాథ కమిషన్ ఇచ్చిన నివేదికను బయటపెట్టే క్రమంలో చైర్మన్ సంతకం లేకుండా వెల్లడించారని గుర్తుచేశారు. కాపులకు నేరుగా రిజర్వేషన్ అమలుచేస్తామని చెప్పి.. తీరా ఈబీసీ కోటాలో సర్దుబాటు చేయడం వల్లే న్యాయ చిక్కుముడు ఎదురయ్యాయని గుర్తుచేశారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్లే కాపులు బీసీల్లో ఉన్నారా? లేక ఈబీసీల్లో ఉన్నారా? అన్నది తెలియడం లేదని చెప్పుకొచ్చారు. మొత్తం తప్పిదాన్ని చంద్రబాబుపై తోసి తాను సేఫ్ జోన్ లోకి వెళ్లాలని ప్రయత్నించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటే.. 50 శాతానికి మించి కల్పించకూడదన్న సుప్రిం కోర్టు ఆదేశాలను గుర్తుచేస్తూ జగన్ సర్కారు కాపుల రిజర్వేషన్ ను పక్కన పడేసింది.

అయితే వైసీపీ సర్కారు దాదాపు కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పడేసింది. టెక్నికల్ సమస్యలను సాకుగా చూపి కేవలం కాపులకు ప్రత్యేక నిధులను బడ్జెట్ లో కేటాయిస్తామని మాత్రమే చెప్పామని.. దీనిని నుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకుంది. అయితే ఇప్పుడు సుప్రిం కోర్టు తాజా ఆదేశాలతో వైసీపీ సర్కారు తీసుకునే నిర్ణయంపైనే కాపుల భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రస్తుతం జనసేనతో పొత్తు ద్వారా కాపుల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. దీంతో కాపుల రిజర్వేషన్ పై ఏదో నిర్ణయం వెల్లడించక తప్పని పరిస్థితి జగన్ సర్కారుకు ఏర్పడింది. ప్రస్తుతం బీసీ జపం పఠిస్తున్న జగన్ కు ఇది సంక్లిష్ట పరిస్థితే. కాపుల రిజర్వేషన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం బీసీలు దూరమయ్యే అవకాశముందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. బీసీ సంఘ నేత, వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరీ.