https://oktelugu.com/

అధికారాలు లేకున్నా.. ఆ పదవి కూడా కీలకమే..!

అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే అంతర్జాయ చూపంతా ఆ దేశంపైనే ఉంటుంది. ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక కాబోతారనేది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎన్నికయ్యే వారి వైఖరి ఎలా ఉంటుంది.. ఆ ప్రెసిడెంట్‌తో తమ దేశానికి నష్టమా..లాభమా.. వీటిపైనే ప్రధాన చర్చ జరుగుతుంటుంది. అంతేతప్ప ఉపాధ్యక్ష పదవి ఒకటి ఉంటుందని, అతని అధికారాలు, అధికార పరిధులు, పాత్ర గురించి ఎవరికీ అంత లోతుగా తెలియదు. Also Read: అగ్రరాజ్యంలో కొత్త శకం ఆరంభం.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 21, 2021 / 11:23 AM IST
    Follow us on


    అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే అంతర్జాయ చూపంతా ఆ దేశంపైనే ఉంటుంది. ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక కాబోతారనేది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎన్నికయ్యే వారి వైఖరి ఎలా ఉంటుంది.. ఆ ప్రెసిడెంట్‌తో తమ దేశానికి నష్టమా..లాభమా.. వీటిపైనే ప్రధాన చర్చ జరుగుతుంటుంది. అంతేతప్ప ఉపాధ్యక్ష పదవి ఒకటి ఉంటుందని, అతని అధికారాలు, అధికార పరిధులు, పాత్ర గురించి ఎవరికీ అంత లోతుగా తెలియదు.

    Also Read: అగ్రరాజ్యంలో కొత్త శకం ఆరంభం.. ముందు ఎన్నో సవాళ్లు

    ఇప్పుడు.. కొత్త చరిత్ర ఆవిష్కృతం అవుతోంది. అమెరికా చరిత్రలోనే ఓ మహిళ.. అందులోనూ భారతీయ మూలాలున్న కమలాహారీస్‌ ఎన్నికకావడం ఇప్పుడు చర్చ అంతా ఆమె వైపే మళ్లింది. నిన్న అధ్యక్ష, ఉపాధ్యక్షులు బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేసినా ఉపాధ్యక్ష పదవిపై అంతటా ఆసక్తి నెలకొంది. రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన అమెరికా రాజ్యాంగం ఉపాధ్యక్షుడికి విశేష అధికారాలు ఏమీ కట్టబెట్టలేదు. అదే సమయంలో ఆయన పాత్రను తక్కువ చేసి కూడా చూడలేదు. కొన్ని సందర్భాల్లో ఆయనకు కీలక పాత్ర కల్పించింది.

    అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ధారించే అధికారాన్ని ఆయనకే కట్టబెట్టింది. ఈ సందర్భంగానే ఇటీవల రిపబ్లికన్ పార్టీకి చెందిన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఫలితాల నిర్ధారణ సందర్భంగా నిక్కచ్చిగా వ్యవహరించి అందరి మన్ననలు అందుకున్నారు. హూందాగా వ్యవహరించి ఉపాధ్యక్ష పదవికి వన్నె తెచ్చారు. ఫలితాల ప్రకటన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన ఒత్తిళ్లను లెక్క చేయకుండా స్వతంత్రంగా వ్యవహరించారు. దీనిని బట్టి ఉపాధ్యక్షుడికి రాజ్యాంగం ఎంతటి ప్రాధాన్యం కల్పించిందో అర్థమవుతుంది.

    Also Read: తొలిరోజే జోబైడెన్ సంచలన నిర్ణయాలివీ..

    అదే సమయంలో అవసరాన్నిబట్టి, సందర్భాన్ని బట్టి అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఉపాధ్యక్షుడికి అవకాశం కల్పించింది. అధ్యక్షుడు మరణించినా, తీవ్ర అనారోగ్యం పాలైనా, అభిశంసనకు గురైనా, మరే కారణం చేత పదవి నుంచి వైదొలగినా నేరుగా అధ్యక్ష పదవిని చేపట్టవచ్చు. మిగిలిన పూర్తి పదవీ కాలానికి అధ్యక్షుడిగా కొనసాగవచ్చు. తద్వారా దేశాన్ని పాలించే, ప్రపంచాన్ని ప్రభావితం చేసే అరుదైన అవకాశం ఉపాధ్యక్షుడికి కల్పించింది. 1800 సంవత్సరం ప్రాంతంలో నాటి అధ్యక్షుడు విలియం హెన్రీ అధ్యక్ష పదవిని చేపట్టిన నెల రోజులకే మరణించారు. దాంతో ఉపాధ్యక్షుడు జాన్ టైలర్ పూర్తికాలం అధ్యక్షుడిగా వ్యవహరించారు.

    మన భారత రాజ్యాంగంతో పోలిస్తే అక్కడి వ్యవస్థకు చాలా పోలిక ఉంది. మన దగ్గర ఉప రాష్రపతి రాజ్యసభ సభ్యుడు కానప్పటికీ ఎక్స్ అఫీషియో సభ్యుడు హోదాలో సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఏదైనా అంశంపై అధికార, విపక్షాల మధ్య ఓటింగ్ జరిగి ఇరువురికి సమాన ఓట్లు లభించినప్పుడు ఓటేస్తారు. మంత్రివర్గ సమావేశాలకు హాజరుకారు. రాష్ట్రపతి మరణించినా, తీవ్ర అనారోగ్యం పాలైనా తాత్కాలిక రాష్ట్రపతిగా ఆరు నెలల పాటు మాత్రమే వ్యవహరిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు కూడా మన రాజ్యసభ లాంటి సెనెట్ కు అధ్యక్షత వహిస్తారు. ఆయనకూ కీలక సందర్భాల్లో అంటే ఇరు పక్షాలకూ సమాన ఓట్లు వచ్చినప్పుడు ఓటేసే అధికారం ఉంటుంది. మన ఉప రాష్ట్రపతి మాదిరిగా కాకుండా అమెరికా ఉపాధ్యక్షుడు మంత్రివర్గ సమావేశాలకు హారవుతారు. ఉపాధ్యక్ష పదవి ఎలాంటి అధికారాలు లేని ఆరో వేలు వంటిదన్న విమర్శలు ఉన్నప్పటికీ ఆయనకూ కొన్ని సందర్భాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందన్న వాస్తవాన్ని విస్మరించరాదు. ప్రత్యేక సందర్భాల్లో ఏకంగా అమెరికా అధ్యక్ష పదవినే అందుకునే అవకాశం ఉంది.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు