Homeజాతీయ వార్తలుKalvakuntla Vamsidhar Rao: ఫ్యామిలీ ఫ్యామిలీని దించేస్తున్న కేసీఆర్‌..!

Kalvakuntla Vamsidhar Rao: ఫ్యామిలీ ఫ్యామిలీని దించేస్తున్న కేసీఆర్‌..!

Kalvakuntla Vamsidhar Rao: కేంద్రంలో అధికారంలోకి రావాలని.. కనీసం అధికారంలోకి వచ్చే పార్టీని శాసించే స్థాయిలో అయినా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశపడుతున్నారు. ఈమేరకు తన తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత రాష్ట్రసమితిగా మార్చేశారు. ఇక తమది జాతీయ పార్టీ అని ప్రకటించారు. కానీ ఆస్థాయిలో పార్టీ విస్తరణ జరుగడం లేదు. కేవలం పొరుగున ఉన్న మహారాష్ట్రలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో పార్టీ నిర్మాణం దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరో కల్వకుంట్ల వారసుడిని రాజకీయాల్లోకి దించాడు. తన అన్న కల్వకుంట్ల రంగారావు కుమారుడు కల్వకుంట్ల వంశీధర్‌రావును బీఆర్‌ఎస్‌ మహారాష్ట్ర ఇన్‌చార్జిగా నియమించారు.

మహారాష్ట్రలోకి కుటుంబం రాజకీయం..
తెలంగాణలో ఇప్పటికే కుటుంబ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహారాష్ట్రలోనూ పార్టీ పగ్గాలను తన కుటుంబం గుప్పిట్లోనే పెట్టుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే తన అన్నకొడుకును రాజకీయాల్లోకి దింపారు. మరోవైపు మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ కమిటీల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ క్రమంలో కల్వకుంట్ల వంశీధర్‌రావుకు సీఎం కేసీఆర్‌ మహారాష్ట్ర బాధ్యతలు కేటాయించారు.

ప్రజారాజ్యం నుంచి పొలిటికల్‌ ఎంట్రీ..
గతంలో చిరంజీవి అభిమానిగా ఉన్న వంశీధర్‌రావు 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత చాలాకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల కొంతకాలంగా బాబాయి కేసీఆర్‌కు దగ్గరగా మెలగుతున్నారు. దీంతో ఆయనకు మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా కీలక బాధ్యతలు అప్పగించారు. కల్వకుంట్ల రంగారావుకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరిలో ఒకరు వంశీధర్‌రావు కాగా, మరో కుమారుడు కల్వకుంట్ల కన్నారావు రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరు.

కాంగ్రెస్‌లో రంగారావు కూతురు..
ఇక రంగారావు కూతురు రమ్యారావు మాత్రం కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. రంగారావు ఫౌండేషన్‌ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వంశీధర్‌రావు సిద్దిపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం ఇటీవల జరిగింది. కానీ, ఆయన అనూహ్యంగా మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌కు ఇన్‌చార్జితోపాటు 15 మంది సభ్యులతో స్టీరింగ్‌ కమిటీని అధినేత కేసీఆర్‌ నియమించినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ తెలిపారు. కమిటీ చైర్మన్‌గా కేసీఆర్‌ వ్యవహరించనున్నారు.

విస్తరణలో భాగంగా…
మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల నిర్మాణం దాదాపు కొలిక్కి వచ్చింది. పార్టీ నిర్మాణంతోపాటు ప్రజల మనోగతాన్ని తెలుసుకోవటం, నియోజకవర్గాలవారీగా సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణను రూపొందించటం వంటి కీలక అంశాలపై పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ ఈ మేరకు శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. స్టీరింగ్‌ కమిటీతోపాటు ఇప్పటికే ప్రకటించిన ఆరు డివిజన్‌ కమిటీ సమన్వయకర్తలకు, సహాయకులుగా ఉండేందుకు సహాయ సమన్వయకర్తలను నియమించారు. రెండు మూడురోజుల్లో 36 జిల్లాలకు పార్టీ సమన్వయకర్తలను, సహాయ సమన్వయకర్తలను నియమించే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular