Homeజాతీయ వార్తలుKalvakuntla Kavitha : కవిత అరెస్ట్ ఎంపీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

Kalvakuntla Kavitha : కవిత అరెస్ట్ ఎంపీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

Kalvakuntla Kavitha : పార్లమెంట్ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితికి బిగ్ షాక్. ఈడీ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడంతో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితిలో కలకలం చెలరేగింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. వరుసగా కీలక నాయకులు పార్టీని వీడిపోతుండడంతో భారత రాష్ట్ర సమితి ఇబ్బందుల్లో ఉంది. ఆ పరిస్థితులు అలా ఉండగానే ఎమ్మెల్సీ కవితను ఈడి అరెస్టు చేయడం ఒక్కసారిగా ఆ పార్టీని కల్లోలంలోకి నెట్టింది.. మరి దీనిని భారత రాష్ట్ర సమితి ఎలా వాడుకుంటుంది? ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తుంది? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే కెసిఆర్ కల చెదిరిపోయింది. కామారెడ్డి లో పోటీ చేసిన కేసీఆర్ కూడా ఓడిపోయారు. ఇక అప్పటినుంచి భారత రాష్ట్ర సమితికి కష్టాలు మొదలయ్యాయి. కీలక నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరారు. మెజారిటీ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. దీనికి తోడు కేసీఆర్ కాలుజారిపడ్డారు. ఆయన ఇంకా ఆ గాయం నుంచి కోలుకోనట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితుల దృష్ట్యా ఆయన నల్లగొండ, కరీంనగర్ సభల్లో పాల్గొన్నారు. పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇవన్నీ జరుగుతుండగానే కవిత అరెస్టు కావడం అటు కేసీఆర్ ను, ఇటు భారత రాష్ట్ర సమితిని షాక్ కు గురిచేసింది.

కొన్ని పార్లమెంటు స్థానాలకు భారత రాష్ట్ర సమితికి అభ్యర్థులు లేరనే చర్చ జరుగుతోంది. ఆరోపణలకు బలం చేకూర్చుతూ కేసీఆర్ ఆ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఇలాంటప్పుడు లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టును భారత రాష్ట్ర సమితి ఎలా తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుందనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. పైగా 2019 ఎన్నికల్లో కవిత పార్లమెంట్ సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇచ్చినప్పటినుంచి ఆమెపై సోషల్ మీడియాలో రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గరనుంచి ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీలో ఇటీవల పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో కవిత నిరసన చేపట్టారు. భారత రాష్ట్ర సమితి పేరుతో కాకుండా భారత జాగృతి పేరు మీద ఆమె ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. సో ఆమె పార్టీకి కూడా దూరమయ్యారనే వాదనలకు ఆ నిరసన బలం చేకూర్చింది. మరి ఇప్పుడు ఆమె అరెస్టును పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఎలా వాడుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ” లిక్కర్ స్కామ్ జరిగిందని ఈడి ఎప్పటినుంచో మొత్తుకుంటున్నది. దీనిపై కవిత కూడా తాను లిక్కర్ స్కామ్ లో పాల్గొనలేదని స్పష్టంగా చెప్పలేకపోతోంది. ఆ మధ్య కవితకు డబ్బులు ఇచ్చానని సుఖేష్ చంద్రశేఖర్ ఆ మధ్య ఆరోపించాడు. జైల్లో ఉండి లేఖలు రాశాడు. ఇవన్నీ పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు.. కవిత స్కామ్ చేయలేదని కెసిఆర్ చెప్పగలరా? అలా చెబితే ఊరుకుంటారా? ఎటువంటి ఆధారాలు లేకుండా ఈడి ఎలా అరెస్టు చేస్తుంది? మొత్తానికి కవిత అరెస్టు పరిణామం భారత రాష్ట్ర సమితికి ఎలాంటి ఉపయోగమూ తీసుకురాదని” రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular