Kadiyam Srihari
Kadiyam Srihari: రాజకీయం అనేది ఎటువంటి రీతులు చూడదు. తనవరకు అధికారం దక్కిందా లేదా అనేది మాత్రమే చూస్తుంది. ఆ అధికారం కోసం ఎంతటి అడ్డదారులు తొక్కడానికైనా ప్రయత్నిస్తుంది.. నాటి మహాభారత కాలం నుంచి నేటి వర్తమాన కాలం దాకా జరిగినవన్నీ ఇలాంటివే. ఈ క్రతువులో ఎవరు, ఎందుకు, దేనికి అనే సందేహాలను పక్కన పెడితే సాధ్యమైనంతవరకు కుయుక్తుల ఆధారంగానే ఈ రాజకీయాలన్నీ నడిచాయి. ప్రస్తుతం తెలంగాణ విషయానికొస్తే ఇలాంటి పన్నాగాలే తెరపైకి మళ్ళీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అధికారం అనే రాజదండం అటువంటిది కాబట్టి.
ఏమీ చెప్పలేని దురవస్థ
కాంగ్రెస్, బిజెపి, టిడిపి, టిఆర్ఎస్.. ఇలా ఏ పార్టీలు చూసుకున్నా.. తమ అధికారాన్ని మరింత పరిపుష్టం చేసుకునేందుకు అడ్డదిడ్డంగా అడుగులు వేసినవే. సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసినవే. సో ఈ దురవస్థ ప్రజాస్వామ్యాన్ని ఎంత హీనానికి తీసుకెళ్తుందో చెప్పలేం. మన పొరుగున ఉన్న ఏపీలో గతంలో జరిగిన ఎన్నికల్లో అక్కడి అధికార టిడిపికి ప్రజలు ఇరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చారు..ఈ ఫలితం చూసి చంద్రబాబు బాధపడ్డాడు. అప్పట్లో చంద్రబాబు ఓటమిని రిటర్న్ గిఫ్ట్ లాగా కేసీఆర్ అభి వర్ణించుకున్నాడు. సీన్ కట్ చేస్తే కేసీఆర్ కు కూడా నాడు ఇటువంటి పరిస్థితిని అనుభవించాడో.. అటువంటి దుస్థితే కేసీఆర్ కు దాపురించింది. నిజానికి ఏ ఆంధ్రా ప్రజలను అతడు తిట్టాడో.. అతడే వారికి అండగా ఉండి ఓట్లు వేశారు. ఒకవేళ వాళ్లే కనక లేకపోయి ఉంటే కేసీఆర్ 23 దగ్గర ఆగిపోయేవాడు. కేసీఆర్ ను సగటు తెలంగాణ వాది నమ్మడం లేదు. ఇప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో భారత రాష్ట్ర సమితిలో ఒక దిద్దుబాటు అంటూ లేదు. కానీ ఫామ్ హౌస్ రాజకీయాలకు మాత్రం తెర లేపింది. కెసిఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు రాగానే చింత మడక నుంచి వందలాదిమంది బస్సుల్లో వచ్చి కేసీఆర్ ను కలిశారు. చేతులెత్తి దండం పెట్టారు. ఆ చింత మడక వాసులకు తను అక్కడ పుట్టాననే కారణంతో ఒక్కో ఇంటికి 10 లక్షల ( ఇది సర్కార్ సొమ్మే) చొప్పున ఇచ్చాడు. అందువల్లే వారు ఆ స్థాయిలో కృతజ్ఞత చూపించారు అనేది మీడియా వర్గాల టాక్. అసలు ఎప్పుడూ లేనిది చింతమడక వాసులు బస్సుల్లో ఫామ్ హౌస్ కు ఎందుకు వచ్చారు? ఫామ్ హౌస్ గేట్లు ఎందుకు తెరుచుకున్నాయి? తెర వెనుక ఉన్నది ఎవరు? ఈ ప్రశ్నలకు ఓ మాజీ మంత్రి వైపు అన్ని వేళ్ళు చూపెడుతున్నాయి. అంతే కాదు ఈ పరిణామం కెసిఆర్ అప్పుడే రాజకీయ చదరంగం ప్రారంభించాడని చెప్పకనే చెబుతోంది. కానీ ఈనాటికి కూడా తన ఓటమిని కెసిఆర్ ఒప్పుకోలేదు. ముఖం చెల్లుబాటు కాక రాజీనామా పత్రాన్ని కూడా నేరుగా వెళ్లి ఇవ్వకుండా తన ఓఎస్డీ ద్వారా పంపాడు.
ప్రభుత్వం కూలుతుందట
పైగా భారత రాష్ట్ర సమితి నాయకులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వారికి బిజెపి నేతలు కూడా తోడవుతున్నారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం పాలించలేదని, తమకు ఎంఐఎం, బీజేపీ, కొంతమంది కాంగ్రెస్ నాయకుల సపోర్టు ఉందని.. కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఆరు నెలలు ఆగితే మళ్లీ అధికారంలోకి వస్తామని స్పష్టం చేస్తున్నారు.. కడియం శ్రీహరి లాంటి నాయకుడు.. సింహం లాగా కేసీఆర్ బయటికి వస్తాడు అని చెబుతున్నారు. తమకు 39 సీట్లు ఉన్నాయని, మజ్లీస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని, ఏమే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కడియం శ్రీహరి అంటున్నాడు. కానీ ఇక్కడ నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సింది బిజెపి . రాష్ట్రంలో ఎదిగే అవకాశాలను చేజేతులా నాశనం చేసుకుంది. రఘునందన్, సంజయ్, ఈటెల రాజేందర్ వంటి వారి ఓటమి కూడా అదే సంకేతాలు ఇస్తున్నది. లక్ష్మణ్, కిషన్ రెడ్డి వంటి వారు పరోక్షంగా ఓడిపోయారు. ఇలాంటి సమయంలో కామారెడ్డిలో వెంకట రమణారెడ్డి వంటి వారి గెలుపు తో తెలంగాణ ఓటర్లు బిజెపి హై కమాండ్ కు అత్యంత స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ఎలాంటి వారి వల్ల పార్టీ బాగుపడుతుందో నేరుగా చెప్పేస్తున్నారు.కానీ బీఆర్ ఎస్ నాయకులు మాత్రం తమకు బీజేపీ మద్దతు ఇస్తుందని ఓపెన్ గా చెప్పడం ఓ విడ్డూరమే.
లెక్కలు కుదురుతాయా?
శ్రీహరి చెబుతున్నట్టు మజ్లీస్, బిజెపి టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తాయా ? అనేది ఇప్పటికీ ఒక డౌటే? కెసిఆర్ దగ్గర సా”ధన” సంపత్తి ఉంది కాబట్టి.. తనకు తెలిసిన విద్య కాబట్టి కాంగ్రెస్ నుంచి కచ్చితంగా లాగేయగలడు. కెసిఆర్ కోవర్టులు కాంగ్రెస్ పార్టీలో చాలామందే ఉన్నారు. మొన్నటికి మొన్న రేవంత్ కు ముఖ్యమంత్రి పదవి దక్కకుండా కాళ్ళల్లో కట్టెలు పెట్టింది వారే కదా! కడియం మాటలు కూడా రేవంత్ కు ఒక హిత బోధ చేస్తున్నాయి . ముందుగా నీ పార్టీపై నీదైన బలాన్ని సమకూర్చుకోవాలని చెపుతున్నాయి. టిఆర్ఎస్ నుంచి, బిజెపి నుంచి కొందరిని రేవంత్ తన వైపు తెచ్చుకోవాల్సిన అనివార్య స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ఇక రేవంత్ కు ఢిల్లీ కి మూటలు పంపే తిప్పలు ఎలాగూ తప్పవు. పైగా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ఖర్చును తెలంగాణ కూడా మోయాలి.. ఈలోగా ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి. ఈలోగానే ఉసిరికాయ మూటల సామెత ద్వారా రేవంత్ కు ఓ హెచ్చరికే పంపాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Kadiyam srihari words also teach revanth a favor
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com