Homeజాతీయ వార్తలుJrNTR : ఖమ్మంలో తాత విగ్రహావిష్కరణకు జూ.ఎన్టీఆర్.. కెసిఆర్ వ్యూహమేంటి?

JrNTR : ఖమ్మంలో తాత విగ్రహావిష్కరణకు జూ.ఎన్టీఆర్.. కెసిఆర్ వ్యూహమేంటి?

JrNTR : తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ సెగ రగులుతునే ఉంది. టీడీపీ నాయకత్వం తారక్ ను పట్టించుకోకున్నా… అభిమానులు మాత్రం భావి నాయకుడిగానే చూస్తున్నారు. ఇది చాలా సందర్భాల్లో వెల్లడైంది. చివరకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో సైతం పార్టీ శ్రేణులు తారక్ ను తీసుకురావాలని నినదించాయి. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో సైతం అవే ప్లకార్డులు దర్శనమిచ్చాయి. కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ను పిలిచినా.. నందమూరి నట వారసులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ లను పిలవకపోవడం విమర్శలకు తావిచ్చింది. అయితే ఈ అరుదైన చాన్స్ ను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. ఇప్పటికే టీడీపీని, ఎన్టీఆర్ అభిమానులను తన వైపు తిప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు వ్యూహాత్మకంగా జూనియర్ పై దృష్టిసారించారు. ఆయన్ను తనవైపు తిప్పుకోవడం ద్వారా బలమైన ఓటు బ్యాంక్ ను టర్న్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు.

విగ్రహావిష్కరణకు ఆహ్వానం..
ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఇందుకుగాను రూ.4 కోట్లు ఖర్చు చేశారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై శ్రీకృష్ణుడు వేషధారణలో ఏర్పాటుచేసిన ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ నెల 28న ఎన్టీఆర్ శత జయంతి వేడుకల నాడు విగ్రహ ఆవిష్కరణకు ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా మంత్రి అజయ్ ఆహ్వానించారు. ఇది రాజకీయంగా సెగలు రేపుతోంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఆహ్వానం లేదని ప్రచారం జరుగుతున్న వేళ.. ఏకంగా ఎన్టీఆర్ భారీ విగ్రహావిష్కరణకు తెలంగాణ మంత్రి ఆహ్వానించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. దివంగ‌త ఎన్టీఆర్ వారసుడిగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను గుర్తించ‌డం వ‌ల్లే విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఆహ్వానించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కమ్మ ఓటు బ్యాంకు కోసమే..
అయితే ఈ అంశాన్ని కేవలం రాజకీయంగానే చూడకూడదని.. కులం కోణంలో సైతం ఆలోచించి పిలిచారన్న టాక్ నడుస్తోంది. ఖమ్మంలో కుల ప్రభావం అధికం. కమ్మ సామాజికవర్గ ప్రభావం అధికంగా ఉంటుంది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఖమ్మం జిల్లాపై ఆ పార్టీకి పట్టు దొరకలేదు. అందుకే అక్కడ వ్యూహాత్మకంగా అడుగులేయ్యాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అది మంత్రి పువ్వాడ ద్వారా సాధించుకోవాలని వ్యూహం పన్నింది. వామపక్షాల కంచుకోటగా ఉన్న ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ పాగ వేయడం వెనుక కమ్మలు ఉండడమే ప్రధాన కారణం. ఇప్పటికీ అక్కడ టీడీపీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణ వ్యాప్తంగా టీడీపీని టర్న్ చేసుకున్నా.. ఖమ్మంలో మాత్రం పట్టుదొరకడం లేదు. అందుకే కేసీఆర్ ఎక్కడా రాజకీయంగా ముందుకు రాకుండా.. కులపరమైన కోణం చూపి మంత్రి పువ్వాడను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.

భారీ డ్యామేజ్…
టీడీపీ ఉద్దేశ పూర్వ‌కంగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ప‌క్క‌న పెట్టిందన్న విమర్శలున్నాయి. 2009లో ఎన్నికల ప్రచారానికి వాడుకున్న తరువాత అస్సలు తారక్ ను పట్టించుకోలేదు. తాజాగా శత జయంతి వేడుకలకు సైతం ఆహ్వానించలేదన్న ప్రచారం ఉంది. ఇటువంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మంలో విగ్రహావిష్కరణకు హాజరైనా టీడీపీకి డ్యామేజ్ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో పార్టీ కేడర్ ను ఉత్తేజితులు చేసి ఓటు బ్యాంక్ ను పెంచుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మంత్రి ఆధ్వర్యంలో జరిగే విగ్రహావిష్కరణకు తారక్ హాజరైతే మాత్రం టీడీపీకి చిక్కులు తప్పవని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular