https://oktelugu.com/

Rammohan Naidu : మోదీ 3.0 లో పిన్నవయస్కుడైన మంత్రిగా రామ్మోహన్ నాయుడు.. మోదీ మెచ్చిన యువనాయకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం నియోజవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు వరుసగా మూడవసారి ఎంపీగా గెలిచారు. రామ్మోహన్ నాయుడు వయసు 36 సంవత్సరాలు.

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2024 / 08:53 PM IST

    Rammohan Naidu

    Follow us on

    Rammohan Naidu : దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, హ్యాట్రిక్ సాధించిన ఘనతను తన సొంతం చేసుకున్నారు.. 2014, 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించినప్పటికీ.. 2024 ఎన్నికల్లో ఆశించినంత స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో, భాగస్వామ్య పార్టీలతో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భాగస్వామ్య పార్టీలలో టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రభుత్వంలో అత్యంత పిన్న వయస్కుడైన మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఘనత సాధించారు.

    శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి..

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం నియోజవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు వరుసగా మూడవసారి ఎంపీగా గెలిచారు. రామ్మోహన్ నాయుడు వయసు 36 సంవత్సరాలు. శ్రీకాకుళం నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి, వైసిపి కి చెందిన పేరడ తిలక్ పై 3.2 లక్షల ఓట్ల తేడాతో రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగారు. ఆయనను అభిమానులు ఎర్రన్న అని పిలిచేవారు. 1996లో 39 సంవత్సరాల వయసులోనే అత్యంత పిన్నవస్కుడైన మంత్రిగా ఎర్రన్నాయుడు రికార్డు సృష్టించారు. 1996-98 మధ్యకాలంలో యునైటెడ్ ఫ్రంట్ (దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రులు) ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచి, లోక్ సభ లో టిడిపి పార్లమెంటరీ నాయకుడిగా పని చేశారు. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు దుర్మరణం చెందారు.

    తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి..

    ఎర్రన్నాయుడు దుర్మరణం తర్వాత 2012లో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడికి అత్యంత విధేయుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు. పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడిని తన తండ్రిగా పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు.. ఆర్కే పురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్య, అమెరికా నుంచి ఇంజనీరింగ్, ఎంబీఏ చదువుకున్న రామ్మోహన్ నాయుడు ఇంగ్లీష్, హిందీ భాషలలో అద్భుతంగా ప్రసంగించగలరు. 2014లో రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి 26 ఏళ్ల వయసులో ఎంపీగా గెలిచారు. 16వ లోక్ సభ లో రెండవ అతి చిన్న వయస్కుడైన ఎంపీగా ఘనత సాధించారు. ఆ టర్మ్ లో ఆయన లోక్ సభ లో టిడిపి ఫ్లోర్ లీడర్ గా కొనసాగారు.. వ్యవసాయం, సంవర్థక శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ లో స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.. రైల్వేలు, హోం వ్యవహారాల శాఖ, పర్యాటకం, సంస్కృతిక శాఖలకు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ, అధికార భాషా శాఖలో సభ్యుడిగా పని చేశారు..

    సంసద్ రత్న అవార్డు..

    పార్లమెంట్ సభ్యుడిగా అసాధారణ పనితీరు కనబరిచినందుకు 2020లో రామ్మోహన్ నాయుడుకు సంసద్ రత్న అవార్డు లభించింది. 2021లో తన భార్య గర్భంతో ఉన్నప్పుడు.. బడ్జెట్ సెషన్ లో పితృత్వ సెలవులు తీసుకోవాలనే ఉద్దేశాన్ని రామ్మోహన్ నాయుడు తెరపైకి తీసుకురావడం పార్లమెంట్ లో చర్చకు దారి తీసింది.. పార్లమెంట్ లో మహిళల రుతుక్రమ ఆరోగ్య విద్య, లైంగిక విద్య పై ప్రభుత్వాలు మరింత అవగాహన పెంచాలని కోరిన మొదటి ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఘనత సృష్టించారు. ఆడవాళ్లు రుతుక్రమం సమయంలో ఉపయోగించే శానిటరీ ప్యాడ్ లపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేసిన తొలి ఎంపీగా రామ్మోహన్ నాయుడు నిలిచారు.