Journalism has faded: మనదేశంలో రాష్ట్రాల పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాలే కాకుండా ఇండియన్, బెంగళూరులోని న్యూ మీడియా కమిట్స్.. అనే సంస్థలు ప్రతిష్టాత్మక జర్నలిజం కోర్సులను బోధిస్తున్నాయి. కొంతకాలంగా ఈ కోర్సులలో చేరే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోతోంది. గతంలో ఈ కోర్సులలో అభ్యసించేవారు భారీగా ఉండేవారు. కొన్ని సందర్భాల్లో తరగతి గదులలో కుర్చీల కొరత కూడా ఉండేది. కానీ గత దశాబ్దం నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కోర్సులలో చేరే వారి సంఖ్య తగ్గిపోయింది. ఖాళీ కుర్చీల సంఖ్య పెరిగిపోయింది. జర్నలిజం చదివే విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ప్రఖ్యాత మీడియా సంస్థల నుంచి ఆయా విభాగాల ఆధిపతులు వస్తుంటారు. జర్నలిజంలో పాఠాలు చెబుతుంటారు. ఫీల్డ్ లో ఎలా వ్యవహరించాలి.. నాన్ ఫీల్డ్ లో ఎంత అప్రమత్తంగా ఉండాలి.. ఎలాంటి టూల్స్ వాడాలి.. ఇలాంటి సాంకేతికతను పునికి పుచ్చుకోవాలి.. వంటి విషయాలను చెబుతుంటారు. దురదృష్టవశాత్తు గత కొంతకాలంగా జర్నలిజం కోర్సులలో చేరే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రఖ్యాత సంస్థల్లోనే ఇలా ఉంటే.. ఇక మిగతా యూనివర్సిటీలలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇవాల్టికి రీజనల్, హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లోని మీడియా సంస్థల్లో ఉద్యోగులను భర్తీ చేసుకోవడానికి.. ముఖ్యంగా జర్నలిజం కేంద్రంగా పనిచేసే ఉద్యోగులను భర్తీ చేసుకోవడానికి ప్రత్యేకంగా కళాశాలలు.. నిర్వహిస్తున్నాయి. ఇక తెలుగు నాట సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతికి పాత్రికేయ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సాక్షి గత కొంతకాలంగా రిక్రూట్మెంట్ ఆపినట్టు తెలుస్తోంది. ఇక జాతీయస్థాయిలో అయితే రిపబ్లిక్ మీడియా ఇటీవల ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థలు మొత్తం కూడా తమ అవసరాలకు ఆధారంగానే శిక్షణ ఇస్తుంటాయి. శిక్షణ సమయంలో ఉపకార వేతనం ఇస్తుంటాయి. ఆ తర్వాత బాండింగ్ లేబర్ పేరుతో ఉద్యోగం చేయించుకుంటాయి. బాండ్ పూర్తయిన తర్వాత.. జర్నలిజం అనే వ్యసనం ఒంట పట్టిన తర్వాత.. ఇతర ఫీల్డ్ లోకి వెళ్లారు కాబట్టి.. చచ్చినట్టు అందులోనే చేస్తారు. కాస్త ఆత్మాభిమానం ఉన్నవాళ్లు వేరే సంస్థకు వెళ్లి పోతారు. అంటే తప్ప జర్నలిజాన్ని వదిలిపెట్టరు.
బయట సమాజం చూస్తున్నట్టు.. జర్నలిజం పెద్ద కెరియర్ కాదు. గొప్పగా ఊహించుకునే జీతాలు ఇందులో ఉండవు. అందరికీ తెరవెనక సంపాదన ఉండదు. కొంతమంది మాత్రమే వైట్ కలర్ నేరాలకు పాల్పడుతుంటారు. భారీగా సంపాదించుకొని.. సమాజంలో మీడియా టైకూన్ లాగా వ్యవహరిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని రాజకీయాలు జర్నలిజంలోనే ఉంటాయి. ఒక మెట్టు పైకి ఎక్కితే.. అక్కడి నుంచి కింద పడేయడానికి 10 మంది ఎదురు చూస్తుంటారు. ఇలా అంతర్గత రాజకీయాల వల్ల కెరియర్లను కోల్పోయిన వాళ్ళు చాలామంది.
జర్నలిజంలో కొత్త రక్తం రావాలి. లేకపోతే ఆ గొప్ప వృత్తి కాలగర్భంలో కలిసిపోతే సమాజం మార్పు చెందలేదు. నిజం బయటికి రాలేదు. ప్రశ్నించే గొంతులు మూగబోతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. ప్రింట్ మీడియా దాదాపు అంపశయ్య పై ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా సంచలనాలకు మాత్రమే కేంద్ర బిందువుగా మారింది.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో జర్నలిజం అనేది కాలగర్భంలో కలిసిపోతే సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే వాస్తవం ఆధారంగానే ఈ ప్రపంచం నడుస్తుంది. అబద్దాల పునాదుల మీద కాదు.. అబద్దాలే రాజ్యాన్ని ఏలితే జరగకూడని పరిణామాలు చాలా జరుగుతాయి. అప్పుడు సమాజం ఎటువైపు వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.